Telangana: నంబర్‌ ప్లేట్లు మార్చాల్సిందే | All Vehicles to Come Fitted with High Security Number Plates | Sakshi
Sakshi News home page

Telangana: నంబర్‌ ప్లేట్లు మార్చాల్సిందే

Jul 9 2025 12:10 PM | Updated on Jul 9 2025 12:47 PM

All Vehicles to Come Fitted with High Security Number Plates

పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌

2019కి ముందు కొన్న వాటికి తప్పనిసరి 

ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన రవాణా శాఖ

సెప్టెంబర్‌ 30వరకు గడువు

భూపాలపల్లి అర్బన్‌: రహదారి భద్రతపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అన్ని రకాల వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నంబరు ప్లేట్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌ఎన్పీ) తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నంబరు ప్లేట్‌ చివరన ఉన్న లేజర్‌ కోడ్‌ను ట్రాక్‌ చేసి వాహనదారు డి పేరు, వివరాలు, వాహనం ధ్వంసమైనా లేజర్‌ కోడ్‌ ద్వారా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. 2019 ఏప్రిల్‌ ఒకటి కన్నా ముందు కొనుగోలు చేసిన వాహనాలకు ఈ నంబరు ప్లేటు బిగించని పక్షంలో రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండదు. సెప్టెంబర్‌ 30లోగా అమర్చుకోవాలని రవాణా శా ఖ స్పష్టం చేసింది. లేనిపక్షంలో భారీ జరిమానాలు, శిక్ష విధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నంబరు ప్లేట్లు అమర్చుకునేందుకు వాహనాల తీరు ఆధారంగా ప్రత్యేక రుసుములు ప్రకటించారు.

కాలంచెల్లిన వాహనాల కట్టడి..
కాలపరిమితి ముగిసిన వాహనాలు రోడ్లపై తిరగకుండా రవాణా శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా 15ఏళ్ల కాలపరిమితి ముగిసిన వాహనాలను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. కాలపరిమితి ముగిసిన వాహనాలు వేర్వేరు నంబరు ప్లేట్లతో రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అనేక వాహనాలకు సకాలంలో సామర్థ్య పరీక్షలు చేయించడం లేదు. ఇకపై అలాంటి వాటికి అడ్డుకట్ట పడనుంది. జిల్లా వ్యాప్తంగా 2019 మార్చి 31లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాహనాలు సుమారు 50వేల వరకు ఉండగా ఇందులో అన్ని రకాల పాత వాహనాలు అంటే కాల పరిమితి ముగిసినవి మినహా మిగతా వాటికి హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు బిగించుకోవాల్సిందేనని అధికారులు స్పష్టంచేశారు. 2019 ఏప్రిల్‌ తర్వాత వాహనాలకు ఇప్పటికే హైసెక్యూరిటీ నంబరు ప్లేటు నిబంధన అమలవుతోంది. ఇప్పటివరకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్‌ బిగించుకున్న వాహనాలు 20వేల వరకు ఉన్నాయి. ఇందులో చాలా వాహనాలు సాధారణ నంబర్‌ ప్లేట్‌తో తిరుగుతున్నాయి. ప్లేట్‌ బిగించని వాహనాలను అమ్మాలన్నా.. కొనాలన్నా ఇబ్బందులు తప్పేలా లేవు. ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేసి జరిమానా వేయడం, వాహనం సీజ్‌ చేయనున్నారు.

మార్పు ఇలా..
పాత వాహనానికి కొత్తగా హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేటు పొందాలంటే వాహనదారుడే నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. http://bookmyhsrp.com వెబ్‌సైట్‌లో వాహనం నంబరు, వాహనం రకం, కంపెనీ, జిల్లా తదితర వివరాలు నమోదు చేయాలి. నంబర్‌ ప్లేట్‌ షోరూం వివరాలు వస్తాయి. వెంటనే ఆ షోరూంకు వెళ్లి వాహనానికి హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ అమర్చుకుని ఫొటో తీసి మరోసారి వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సిన బాధ్యత వాహనదారుడిపై ఉంది. ఈ విధానంతో నిరక్షరాస్యులు, స్మార్ట్‌ఫోన్లు లేని వాహనదారులు అయోమయానికి గురికానున్నారు.

విధిగా అమర్చుకోవాలి..
పాత వాహనాలకు కొత్తగా హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లు విధిగా అమర్చుకోవాల్సిందే. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు నిర్ణయించిన ఫీజుతో నంబర్‌ ప్లేట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్లపై తిరిగే ప్రతీ వాహనం హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్‌ అమర్చుకోవాలి. తనిఖీలో పట్టుబడితే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేస్తాం. అవసరమైతే బీమా, రిజిస్ట్రేషన్‌ తదితర సేవలు నిలిపివేసేలా రవాణా శాఖ చర్యలు చేపడుతోంది.
– సందాని, డీటీఓ, భూపాలపల్లి

రుసుము (రూ.లలో) ఇలా..

ద్విచక్ర వాహనాలు 300–350

త్రిచక్ర వాహనాలు 350–450

కార్లు 550–700

కమర్షియల్‌ వాహనాలు 600–800

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement