
ఇంజనీరింగ్ బోధన తీరుపై ఏఐసీటీఈ
ఫ్యాకల్టికి ఆన్‌లైన్ శిక్షణ అవసరం.. డేటాసైన్స్ బోధన డల్‌గా ఉంది
సైబర్ సెక్యూరిటీ ట్రెండ్ గుర్తించాలి
వర్సిటీలకు మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ బోధన తీరులో మార్పు రావాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అభిప్రాయపడింది. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. ఎక్కువమంది విద్యార్థులు చేరుతున్న కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ ఎమర్జింగ్ కోర్సులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా బోధన ఉండాలని తెలిపింది. ఫ్యాకల్టీ అప్‌గ్రేడ్ అవ్వాలని, కాలేజీలు, వర్సిటీలు ఈ దిశగా శిక్షణ కార్యక్రమాలకు పదును పెట్టాలని వివరించింది. ఇదే తీరుగా బోధన కొనసాగితే విద్యార్థుల్లో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటాయని, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని తెలిపింది.
మారుతున్న ట్రెండ్
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పెరిగాయి. 2020–21లో 12,86,725 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 7,28,443 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరారు. ఆ సమయంలో కంప్యూటర్ కోర్సుల్లో 42 శాతం మాత్రమే చేరారు. కోర్ గ్రూపుల్లో ఎక్కువ మంది సీట్లు పొందారు. 2024–25 నాటికి ఈ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇంజనీరింగ్‌లో 14,97,653 సీట్లు అందుబాటులో ఉంటే, 12,52,627 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ సంవత్సరం కంప్యూటర్, ఇతర ఎమర్జింగ్ కోర్సుల్లో చేరినవారు 71 శాతం ఉన్నారు.
కోర్ గ్రూపుల్లో ప్రవేశాలు సగం పడిపోయాయి. దాదాపు 7 లక్షలకుపైగా విద్యార్థులు కంప్యూటర్ విభాగాల్లో ఏటా పట్టాలు పొందుతున్నారు. ఈ ఏడాది (2025–26) ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 15,98,245కు చేరింది. ఏడాది కాలంలోనే ఏకంగా లక్ష ఇంజనీరింగ్ సీట్ల లభ్యత పెరగ్గా, వీటిల్లో 90 శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి.
క్రిప్టో కలేజానే కీలకం
విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ బ్రాంచ్‌లకు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే, ఈ కోర్సుల బోధన ఇప్పటికీ సాధారణంగానే ఉందని ఏఐసీటీఈ భావిస్తోంది. కొత్త కోర్సులు కావడం, ఫ్యాకల్టీ వీటిపై మాస్టర్ డిగ్రీలు చేయకపోవడం ప్రధాన కారణాలుగా గుర్తించింది. సైబర్ సెక్యూరిటీ విధానాల్లో ప్రతీరోజూ గణనీయమైన మార్పులు వస్తున్నాయి. నెట్‌వర్క్ సెక్యూరిటీ సిస్టమ్‌ను కంపెనీలు మైక్రోచిప్ లెవల్‌కు తీసుకెళుతున్నాయి.కోడింగ్ సమాచారం క్రిప్టోగ్రఫీ ద్వారా అందిస్తారు. ఈ విధానంలోనూ అత్యాధునిక మాడ్యూల్స్ ప్రవేశించాయి.
బహుళజాతి సంస్థలు క్రిప్టోగ్రఫీని తరచూ మారుస్తున్నాయి. ఎతి్నకల్ హ్యాకింగ్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వచ్చింది. హ్యాక్ విధానమే కాదు... ఫైర్‌వాల్ సెక్యూరిటీ తీరు ఏడాదికి ఇప్పటికీ పోలిక లేనంతగా మారింది. కొన్ని కోడ్స్ అర్థం చేసుకోలేనంతగా వస్తున్నాయి. డిజిటల్ ఫోరెన్సిక్‌పై ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈనాటికీ సరైన అప్‌గ్రేడ్ లేదని ఏఐసీటీఈ నిపుణులు అంటున్నారు.
దడ పుట్టించే డేటా
డేటాసైన్స్ బోధనలో కీలకమైన టెక్నిక్స్‌లో పరిపూర్ణత ఉండటం లేదని ఏఐసీటీఈ భావిస్తోంది. ఇంటర్ మేథ్స్‌పై పట్టు లేకున్నా, ఇంజనీరింగ్‌లో డేటాసైన్స్ తీసుకుంటున్నారు. ఉద్యోగం తేలికగా వస్తుందనే విద్యార్థులు భావిస్తున్నారు. అయితే, బోధనలో సరైన మెళకువలు విద్యార్థులు నేర్చుకోవడం లేదు. బిగ్ డేటా సెంటర్స్‌లో లాంగ్వేజ్, లాంగ్వేజ్ మాడ్యూల్స్ అత్యాధునికంగా వినియోగిస్తున్నారు. ప్రోగ్రామింగ్‌లో పైథాన్ అండ్ ఆర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వచ్చింది. డేటా విజువలైజేషన్‌లో పవర్ బీఐ, డీ3 పాయింట్ జేఎస్ వంటి వేగవంతమైన టెక్నాలజీ వచ్చింది. డేటా టెక్నాలజీలు కూడా మారిపోయాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇలాంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ బోధన జరగడం లేదు. దీంతో డేటాసైన్స్ పూర్తి చేసినా, కంపెనీలకు వారు సరిపోవడం లేదు.
అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే...
ఇంజనీరింగ్ సిలబస్ కేవలం బేసిక్స్ మాత్రమే నేర్పుతుంది. ప్రొఫెషనల్ స్కిల్స్‌పై బోధకులకు ఇంకా లోతైన పరిజ్ఞానం ఉండటం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఫ్యాకల్టికి సరైన శిక్షణ ఇప్పించాల్సిన అవసరముందని ఏఐసీటీఈ సూచిస్తోంది. సాఫ్ట్‌వేర్ రంగంలోని ప్రొఫెషనల్స్‌తో ఓరియంటేషన్ తీసుకోవడం, ప్రపంచంలోని కొన్ని పరిశోధన సంస్థలు, బిగ్‌డేటా అందించే కంపెనీలతో ఆన్‌లైన్ శిక్షణ ఇప్పించాలని తెలిపింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వస్తున్న సాంకేతికతను తెలుసుకునే డిజిటల్ లే»ొరేటరీలను కూడా సూచిస్తోంది. ఈ దిశగా కాలేజీ యాజమాన్యాలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కోరింది.
నాణ్యత దిశగా అడుగులు
మార్పులకు అనుగుణంగా బోధన ప్రమాణాలు పెరగాల్సిన అవసరముంది. నాణ్యతకు ఇదే ప్రామాణికం అవుతుంది. ఈ దిశగా ప్రయత్నాలు వేగంగానే జరుగుతున్నాయి. అనేక మార్గాల్లో అధ్యాపకులను అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియ మొదలైంది. ఇంజనీరింగ్ బోధన వేరు... ప్రొఫెషనల్ స్కిల్‌ను జోడించడం వేరు. ఈ రెండూ సమన్వయం చేయడానికి కృషి జరుగుతోంది. – డాక్టర్ కె.విజయకుమార్‌రెడ్డి (జేఎన్‌టీయూహెచ్ రెక్టార్)