
అంత్యక్రియలకు మార్గం సుగమం
కట్నం డబ్బుల విషయంలో కుదిరిన రాజీ
ఏరియా ఆసుపత్రిలోనే రెండ్రోజులు మృతదేహం
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో మహిళ అంత్యక్రియల విషయంలో అనిశ్చితి ఏర్పడింది. ప్రమాదంలో గాయపడి మృతిచెందగా.. కట్నం డబ్బుల విషయమై తలెత్తిన వివాదం అందుకు కారణమైంది. శుక్ర, శనివారాల్లో మృతదేహం ఏరియా ఆస్పత్రిలోనే ఉంచాల్సి వచ్చింది. పోలీసుల రంగప్రవేశం, పెద్దల పంచాయితీతో వివాదం సమసిపోయింది.
వివరాలిలా ఉన్నాయి. రామకృష్ణాపూర్ పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు గాండ్ల సత్యం, ఆయన కూతురు ముద్దసాని లావణ్య ఇటీవల పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సత్యం అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన లావణ్య (29) హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయింది. మృతదేహాన్ని శుక్రవారం ఇక్కడికి తరలించగా.. అంత్యక్రియల సమయంలో అనిశ్చితి నెలకొంది. కాగా, లావణ్యకు రామకృష్ణాపూర్‌లోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన ముద్దసాని సురేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహామైంది. కొన్నేళ్లుగా వీరి మధ్య కుటుంబ కలహాలతో లావణ్య తల్లిగారింటి వద్ద ఉంటుంది.
కట్నం డబ్బుల విషయమై..
లావణ్య తల్లిగారింటి వద్దే ఉంటుండడంతో ఆమె కుటుంబ సభ్యులు సురేష్‌కు ఇచ్చిన కట్నం డబ్బులు ఇవ్వాలని గతంలో నుంచే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. లావణ్య, ఆమె తండ్రి ఇద్దరు మరణించడంతో పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం రూ.50లక్షలు, బంగారం ఇస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని, లేదంటే అత్తారింటి ఎదుట మృతదేహంతో బైఠాయిస్తామని చెప్పడంతో వివాదం తలెత్తింది. మృతదేహాన్ని తమ ఇంటి వద్దకు తీసుకువచ్చే అవకాశం ఉందని గ్రహించిన సురేష్ తండ్రి ముందే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి అంబులెన్స్‌లోని ఫ్రీజర్‌లో భద్రపర్చారు. శుక్రవారం నుంచి శనివారం వరకు ఈ ప్రతిష్టంభన కొనసాగింది. పెద్ద మనుషులు జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. రూ.50 లక్షల కట్నంలో రూ.20 లక్షలు తిరిగి ఇవ్వడానికి అంగీకారం కుదరడంతో వివాదం సమసిపోయింది. అనంతరం లావణ్య బంధువులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.