
నీటిపారుదల శాఖలో ఏసీబీ ఫోబియా
వరుస దాడులు, అరెస్టులతో కలకలం
ఏకంగా ఇద్దరు ఈఎన్సీల అరెస్టుతో ప్రకంపనలు
నెలాఖరులోగా సర్కారుకు జస్టిస్ ఘోష్ నివేదిక
ఆ వెంటనే మరికొందరిపై దాడులు జరగవచ్చనే చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖలోని కీలక ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లపై అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) వరుస దాడులు, అరెస్టులు కలకలం రేపుతున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చక్రం తప్పిన ఇంజనీర్లే లక్ష్యంగా ఏసీబీ దాడులు చేస్తుండడం శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తదుపరిగా ఎవరిపై దాడులు జరుగుతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి భారీ సీపేజీలు ఏర్పడ్డాయి.
ఈ ఉదంతాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణ జరిపించగా, ఏకంగా 38 మంది ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆ విభాగం సిఫారసు చేసింది. దీంతో వీరికి సర్కారు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పదోన్నతులు నిలుపుదల చేసింది.
మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసి బరాజ్‌ల నిర్మాణంలో అవినీతి, అవకతవకలపై సమాంతర విచారణ జరిపిస్తోంది. ఈ నెలాఖరులోగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఏసీబీ అరెస్టుల పర్వానికి తెరతీసింది.
తొలుత హరిరామ్..తర్వాత శ్రీధర్, మురళీధర్‌రావు
నీటిపారుదల శాఖలో గజ్వేల్ ఈఎన్‌సీ, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా రెండు కీలక హోదాల్లో కొ నసాగుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన భూక్య హరిరామ్‌ను గత ఏప్రిల్ 26న ఏసీబీ అరెస్టు చేసింది. ఎస్సారెస్పీ డివిజన్–8 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌ను గత నెల 11న అరెస్టు చేసింది.
శ్రీధర్ కూడా కాళేశ్వరం నిర్మాణంలో పాలుపంచుకున్నారు. వీరిద్దరి వద్ద రూ.వందల కోట్లు విలువైన స్థిర, చరాస్తులు లభించాయి. హరిరామ్‌కు ఇటీవల బెయిల్ లభించగా, శ్రీధర్ రిమాండ్‌లోనే ఉన్నారు. ఇదే క్రమంలో గత మంగళవారం నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ(జనరల్) సి.మురళీధర్ రావును కూడా ఏసీబీ అరెస్టు చేయడం శాఖలో ప్రకంపనలు సృష్టించింది.
ఈఎన్సీగా సుదీర్ఘ కాలం కొనసాగిన మురళీధర్‌రావు
2011 ఆగస్టు 1 నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్)గా కొనసాగుతున్న మురళీధర్‌రావు 2013 లోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా, తెలంగాణ వచ్చాక కూడా ఆయన అదే పోస్టులో కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత కూడా ఆయన్ను ప్రభుత్వాలు కొనసాగించాయి. ముఖ్యంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు చెబుతారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లపై విజిలెన్స్ విభాగం సమర్పించిన మధ్యంతర నివేదిక ఆధారంగా 2024 ఫిబ్రవరి 8న ఆయనతో ప్రభుత్వం రాజీనామా చేయించింది.
ఆ తర్వాత పలుమార్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలకు ఆయన హాజరై వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా ఆయన్ను ఏసీబీ అరెస్టు చేయడం, ఆయనకు సంబంధించిన నివాసాల్లో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడడంతో శాఖలో మరోసారి కల కలం రేగింది. ఇలా ఉండగా.. నెలాఖరులోగా జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వెంటనే మరికొందరిపై ఏసీబీ దాడులు జరగవచ్చనే చర్చ శాఖలో జరుగుతోంది.
సర్కారు లక్ష్యం వారే..
బీఆర్‌ఎస్ పాలనలో చక్రం తప్పిన కొందరు ఇంజనీర్లు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఆ పార్టీ ముఖ్యనేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని, శాఖ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఓ మాజీ మంత్రికి రహస్యంగా చేరవేస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. కొందరు ప్రభుత్వ విధానాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ ప్రతిపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కూడా సర్కారుకు నివేదికలు అందాయనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి ఇంజనీర్లను ఏసీబీ లక్ష్యంగా చేసుకోవచ్చని అంటున్నారు.