ఫార్ములా ఈ–రేస్‌ కేసులో చార్జిషీట్‌? | ACB Files Chargesheet in Formula E Case: KTR Named A1 Over Rs 55 Crore Irregularities | Sakshi
Sakshi News home page

ఫార్ములా ఈ–రేస్‌ కేసులో చార్జిషీట్‌?

Mar 24 2026 3:28 AM | Updated on Mar 24 2026 3:28 AM

ACB Files Chargesheet in Formula E Case: KTR Named A1 Over Rs 55 Crore Irregularities

మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్‌ ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్‌ సహా ఐదుగురిపై అభియోగాలు 

హెచ్‌ఎండీఏకు చెందిన రూ. 55 కోట్లు దుర్వినియోగం చేశారన్న ఏసీబీ 

కోర్టు పరిశీలనలో చార్జిషిట్‌.. అనంతరం మొదలుకానున్న కేసు విచారణ

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా–ఈ రేస్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు చార్జిషిట్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై అభియోగాలు మోపుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ చార్జిషిట్‌ దాఖలు చేసినట్లు సమాచారం. అలాగే ఏ2గా సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బి. లక్ష్మీనర్సింహారెడ్డి (బీఎల్‌ఎన్‌ రెడ్డి), ఏ4గా స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ కిరణ్‌ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన ఎఫ్‌ఈఓ సంస్థలను చేర్చింది.

హెచ్‌ఎండీఏ బోర్డుకు చెందిన రూ. 55 కోట్లను విదేశీ సంస్థలకు నిందితులు మళ్లించినట్లు ఏసీబీ పేర్కొంది. దాదాపు వెయ్యికిపైగా పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించింది. ఈ చార్జిషిట్‌ను కోర్టు పరిశీలిస్తోంది. పత్రాల పరిశీలన అనంతరం విచారణకు స్వీకరించనుంది. ఆ తరువాత  కేటీఆర్‌ సహా నిందితులంతా కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. 

నిబంధనలు ఉల్లంఘించారని.. 
ఇప్పటికే కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌ చేసేందుకు గత గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఐఏఎస్‌ అర్వీద్‌కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి లభించడం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్‌ సాగర్‌ వద్ద ఫార్ములా–ఈ కార్‌ రేస్‌ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి హెచ్‌ఎండీఏకు చెందిన రూ. 54.89 కోట్లను విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక హెచ్‌ఎండీఏ నిధుల దుర్వియోగంపై ఎంఏయూడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఐఏఎస్‌ దానకిషోర్‌ 2024 డిసెంబర్‌ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్‌ 19న ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీంతో గత ప్రభుత్వంలో మున్సిపల్‌ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా, అప్పటి పురపాలన, పట్టణాభివృద్ధి ప్రత్యేక సీఎస్‌గా ఉన్న అర్వీద్‌ కుమార్‌ను రెండో నిందితుడిగా, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని మూడో నిందితుడిగా చేర్చింది. ఈ ముగ్గురితోపాటు ఫార్ములా–ఈ కార్‌ రేసింగ్‌ ఆర్గనైజర్, గ్రీన్‌కో ఏస్‌ నెక్సŠట్‌జెన్‌ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్, ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌ సంస్థ ప్రతినిధులను ఏసీబీ విచారించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement