షీ టీమ్స్‌ పనితీరు భేష్

96 per cent people are satisfied with the performance of the She Teams - Sakshi

94 శాతం మంది ప్రజలు, 96% మంది ఫిర్యాదు దారుల సంతృప్తి

జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్వహించిన ‘సెస్‌’సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతపై తెలంగాణ పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌ పనితీరుపై 96 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 4 శాతం మంది తాము చేసిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను తెలపకపోవడం, ఫిర్యాదు చేసేందుకు వెళితే సరిగ్గా స్పందించలేదని చెప్పారు. ఈ గణాంకాలను పోలీస్‌ శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలో షీ టీమ్స్‌ సంబంధిత నేరాలపై స్పందించిన అధికారులతో ఒక్క రోజు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని షీ టీమ్స్‌ అధికారులు, షీ టీమ్స్‌కు పట్టుబడ్డ దాదాపు 120 మంది నిందితులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపిందని స్వాతిలక్రా పేర్కొన్నారు.

షీ టీమ్స్‌ పనితీరుపై ప్రముఖ సంస్థ ‘సెస్‌’ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలో సర్వే చేయించామని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపుల కేసులు, ఈవ్‌ టీజింగ్‌లపై అధికంగా వాట్సాప్, ఫోన్ల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని కేసులుగా నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న డీఐజీ సుమతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో షీ టీమ్స్‌ పనితీరుపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్‌లో షీటీమ్స్‌కు పట్టుపడ్డ వారిలో అధికంగా విద్యావంతులు, మేజర్‌లే ఉన్నారన్నారు. తప్పు చేస్తే ఎవరినీ వది లేది లేదని.. సైబరాబాద్‌ పరిధిలో మహిళలను వేధించిన ఘటనలో 51 ఏళ్ల వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే ఇం దుకు నిదర్శనమన్నారు. కాగా, మనో చేతనకు చెందిన గీతా చల్లా ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

నవంబర్‌లో అధికంగా ఫిర్యాదులు
నవంబర్‌లో షీ టీమ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 464 ఫిర్యాదులు అందాయి. ఇందులో నేరుగా 151, పరోక్షంగా (వాట్సాప్, ఈ–మెయిల్, ట్విటర్, హాక్‌–ఐ) 313 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఫోన్‌ ద్వారా వేధింపులు కాగా, 246 ఈవ్‌ టీజింగ్, సోషల్‌ మీడియా వేధింపులు తదితరాలు ఉన్నాయి. వీరిలో 90 మందిని హెచ్చరించి, 82 మందికి కౌన్సెలింగ్‌ చేసి పంపారు. 56 మందిపై కేసులు నమోదు కాగా, 52 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top