బంజారాహిల్స్‌లో 8 ఎకరాలు వేలానికి సిద్ధం | 8 acres in Banjara Hills ready for auction | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో 8 ఎకరాలు వేలానికి సిద్ధం

Jun 7 2026 4:23 AM | Updated on Jun 7 2026 4:23 AM

8 acres in Banjara Hills ready for auction

ఇక్కడ పార్కు నిర్మిస్తామని గతంలో చెప్పిన పొన్నం

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): రాజధాని నగరంలో బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లోని ఎమ్మెల్యేకాలనీలో ఏసీబీ కార్యాలయం ఎదురుగా షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఏడాది క్రితం స్వాధీనం చేసుకున్నారు. సర్వేనంబర్‌ 102/1లోని ఈ స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటుచేశారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు అప్పటి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఈ స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలంలో అందమైన ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతామని, స్థానికులకు అనుకూలంగా వారి ప్రయోజనాల కోసమే స్థలాన్ని వినియోగిస్తామని హామీ ఇచ్చారు. 

అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత నెల రోజులకే ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు హెచ్‌ఎండీఏకు అప్పగించారు. పంచనామా అనంతరం స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హెచ్‌ఎండీఏ ఇందులో 8 ఎకరాల 24 గుంటల స్థలాన్ని విక్రయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి వేలం వివరాలను తెలియజేస్తూ భారీ బోర్డు అక్కడ ఏర్పాటుచేసింది. మంత్రి ఇచ్చిన హామీలు, తాము చేసిన డిమాండ్లు ఫలించకపోగా, స్థలాన్ని వేలం వేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

వేలానికి సిద్ధమైన హెచ్‌ఎండీఏ.. ఈ నెల 12న ప్రీబిడ్‌ మీటింగ్‌ నిర్వహిస్తామని, రిజిస్ట్రేషన్లకు, బిడ్‌ డాక్యుమెంట్‌ ఫీజుకు ఈ నెల 17వ తేదీ గడువు అని పేర్కొంది. వేలాన్ని ఈ నెల 19న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కూడా నోటీసులో తెలిపింది. బహి రంగ మార్కెట్‌లో ఈ స్థలం విలువ రూ.వెయ్యి కోట్ల దాకా ఉంటుంది. ఈ స్థలాన్ని వేలం వేయడం ద్వారా సర్కార్‌ ఖజానాకు కోట్లాది రూపాయలు సమకూరనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement