6,7,8 తరగతులు నేటి నుంచే

6,7,8 Classes Starts From Today In Telangana - Sakshi

ఆ క్లాసులకూ ప్రత్యక్ష బోధన ప్రారంభానికి సర్కారు నిర్ణయం

తరగతి గదులు తక్కువుంటే షిఫ్ట్‌ పద్ధతిలో స్కూళ్లు

అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి సబిత ప్రకటన  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 1వ తేదీ నుంచి 9, 10, ఆపై తరగతుల్లో ప్రత్యక్ష బోధనను ప్రారంభించిన ప్రభుత్వం తాజాగా 6, 7, 8 తరగతులకు సైతం ప్రత్యక్ష బోధనను నేటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి 1వ తేదీలోగా ఆయా తరగతులను యాజమాన్యాలు విడతలవారీగా ప్రారంభించుకునేందుకు అనుమతించింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, పాఠశాల విద్యా డైరెక్టర్‌ దేవసేన, అదనపు డైరెక్టర్లు సత్యనారాయణరెడ్డి, రమేశ్‌ తదితరులతో మంగళవారం తన కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

అవసరం ఉన్న చోట షిఫ్ట్‌ పద్ధతి...
ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 17.10 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యే అవకాశం ఉంది. విద్యాశాఖ పరిధిలోని 8,891 పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు చదివే 8,88,742 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు కానున్నారు. అలాగే 10,275 ప్రైవేటు పాఠశాలల్లోని 8,28,516 మంది విద్యార్థులు, వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న 1,157 గురుకుల విద్యా సంస్థల్లో 1,98,853 మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు హాజరయ్యేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార్థులు అధిక సంఖ్యలో పాఠశాలలకు వస్తారు కనుక తరగతి గదులు తక్కువగా ఉన్న చోట షిఫ్ట్‌ పద్ధతిలో బోధనను కొనసాగించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు వాటిని పర్యవేక్షించేలా చర్యలు చేపడుతోంది. తరగతి గదులు తక్కువ ఉన్న పాఠశాలల్లో ఉదయం 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహించేలా, మధ్యాహ్నం 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధనను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది.

నిబంధనలు పక్కాగా పాటించేలా...
స్కూళ్లలో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్కో విద్యార్థికి మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలని, తరగతి గదికి 20 మందికి మించి విద్యార్థులను కూర్చోబెట్టరాదని పేర్కొంది. అలాగే తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే విద్యార్థులను తరగతులకు అనుమతించాలని తెలిపింది. ప్రత్యక్ష బోధనకు హాజరు కావాలని విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని విద్యాశాఖ స్పష్టం చేసింది. పాఠశాలలకు హాజరు తప్పనిసరి కాదని, పాఠశాలలకు రాని విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధనను యథావిధిగా కొనసాగించాలని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎల్‌కేజీ నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యక్ష బోధన లేదని స్పష్టం చేసింది. వారికి ప్రత్యక్ష బోధన లేకుండానే పైతరగతులకు ప్రమోట్‌ చేయనుంది.

పరీక్షలకు హాజరవడమూ ఐచ్ఛికమే...
పరీక్షలకు హాజరు కావాలంటే ప్రత్యక్ష బోధనకు హాజరు కావాలనే నిబంధనను విధించవద్దని స్కూళ్లకు విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షల హాజరు కూడా విద్యార్థుల ఇష్టమేనని పేర్కొంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు విద్యార్థులను ఫెయిల్‌ చేయడానికి వీల్లేదని, నో డిటెన్షన్‌ పాలసీ అమల్లో ఉందని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పేర్కొంది. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించవద్దని సూచించింది. పాఠశాలల్లో 70 శాతం సిలబస్‌ బోధననే చేపట్టాలని, మిగిలిన 30 శాతం సిలబస్‌ను ప్రాజెక్టు వర్క్, అసైన్‌మెంట్స్‌కే పరిమితం చేయాలని గతంలోనే స్పష్టం చేసినట్లు వెల్లడించింది.

ఇబ్బందులు లేనందునే...
రాష్ట్రంలో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు లేవు. అందుకే 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గతంలోనే ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించాలనుకున్నా పరిస్థితిని అంచనా వేసేందుకు ఆగాం. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకపోవడం, తల్లిదండ్రులు, సంఘాల నుంచి విజ్ఞప్తులు వస్తుండటంతో ప్రత్యక్ష బోధనకు నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నింటిలో శానిటైజేషన్‌ ప్రక్రియ చేపట్టాలి. విద్యార్థులు, టీచర్లు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. భౌతికదూరం నిబంధనలు పాటించాలి. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top