బిర్లా సైన్స్‌ సెంటర్‌లో లక్షల ఏళ్ల నాటి ఏనుగు దంతాలు | 6,000-Year-Old Stegodon Fossils Discovered in Ramagundam Medapalli Mine | Sakshi
Sakshi News home page

బిర్లా సైన్స్‌ సెంటర్‌లో లక్షల ఏళ్ల నాటి ఏనుగు దంతాలు

Oct 11 2025 11:49 AM | Updated on Oct 11 2025 7:28 PM

6,000-year-old Stegodon fossils at Ramagundam Medapalli opencast

సింగరేణి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని తవ్వకంలో సందర్భంగా లభ్యమైన 110 లక్షల సంవత్సరాల నాటి స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాల అవశేషాలను.. డైనోసార్ కాలానికి చెందిన శిలాజ క‌ల‌ప‌ను పొందుప‌రుస్తూ బిర్లా సైన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సింగరేణి పెవిలియన్ను శనివారం సింగ‌రేణి సీఎండీ ఎన్.బ‌ల‌రామ్‌, జి.పి. బిర్లా పురావస్తు, ఖగోళ, వైజ్ఞానిక సంస్థ ఛైర్‌ప‌ర్స‌న్ నిర్మల బిర్లా ప్రారంభించారు.

 నాలుగేళ్ల క్రితం రామగుండం-1 ఏరియాలో మేడిపల్లి ఓపెన్ కాస్టు గని లో మైనింగ్ కార్యకలాపాలు జరుపుతున్న సందర్భంగా రెండు భారీ ఏనుగు దంతాలు, దవడ ఎముకలు శిలాజ రూపంలో ల‌భ్య‌మ‌య్యాయ‌ని సీఎండీ పేర్కొన్నారు. ఇది గోదావరి పరివాహక ప్రాంతంలో 110 లక్షల సంవత్సరాల క్రితం సంచరించిన‌ అనంతరం అంతరించిపోయిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగు అవశేషాలుగా శాస్త్రజ్ఞులు గుర్తించారని, చరిత్ర పూర్వ యుగానికి చెందిన ఈ అవ‌శేషాల‌ను ప్రజలు, విద్యార్థులు వీక్షించడానికి అనువుగా ప్రతిష్టాత్మకమైన బిర్లా సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ప్రజల్లో శాస్త్రీయ దృక్పథ‌మైన‌ ఆలోచనను కలిగించేందుకు విశేషమైన కృషి చేస్తున్న బిర్లా సైన్స్ సెంట‌ర్‌ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. దేశం కోసం బిర్లా సంస్థ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఈ విజ్ఞాన కేంద్రాలు విద్యార్థుల మేథో శ‌క్తిని పెంచ‌డానికి దోహ‌ద‌ప‌డుతున్నాయి. ప్రాచీన కాలంనాటి అవశేషాలతో నాటి చరిత్రను, ఖగోళ, భూగోళ పరిశోధనలు, ఆవిష్కరణలు మొదలైన వాటితో సమాజంలో, విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు, దృక్పథాన్ని కల్పించడం చాలా గొప్ప విషయమని, ఈ సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న ఇస్రో, జియోలాజిక‌ల్ సర్వే ఆఫ్ ఇండియా, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా, వంటి సంస్థల సరసన తాము కూడా చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా బి.ఎం. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్  కె.మృత్యుంజయ రెడ్డి మాట్లాడుతూ ప్రాచీన కాలంనాటి ఒక గొప్ప చారిత్ర‌క ఆనవాలును సింగరేణి సంస్థ భద్రపరిచి, తమకు అందించడం పై సంతోషం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ల‌భ్య‌మైన‌ భారీ డైనోస‌ర్ ఎముకలతో బిర్లా మ్యూజియంలో డైనోసార్ అస్థిపంజరాన్ని పునఃప్రతిష్టించామనీ, దాదాపు అదే కాలంలో సంచరించిన స్టెగోడాన్ ఏనుగు అవశేషాలు సింగరేణి ద్వారా లభించగా వీటిని డైనోస‌ర్ పెవిలియన్ పక్కనే ఏర్పాటు చేశామ‌ని తెలియజేశారు.

నాటి ఏనుగు దంతాలు ఎలా దొరికాయి అంటే....
రామగుండం-1 ఏరియా పరిధిలో గోదావరి నదికి పక్కన నాలుగేళ్ల క్రితం మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని క్వారీ తవ్వుతున్న సందర్భంగా పొడుగాటి కొమ్ముల మాదిరిగా ఉన్న నాలుగు శిలాజాలను గుర్తించారు. ఇవి పాతకాలం నాటి జంతు అవశేషాలుగా భావించి ఉద్యోగులు యాజమాన్యానికి తెలియజేశారు. యాజమాన్యం వారు వీటిని పరిశోధకులకు చూపించగా ఇవి సుమారు 110 లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో జీవించి, 6000 సంవత్సరాల క్రితం భూమి నుంచి అంతరించిపోయిన స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాలు అని గుర్తించారు. 

సాధారణంగా ఇప్పటి ఏనుగు దంతాలు రెండు లేదా మూడు అడుగుల పొడవు మాత్రమే ఉంటుండగా, నాటి ఏనుగు దంతాలు సుమారు 12 అడుగుల పొడవు వరకు ఉండేవని, ఏనుగు 13 అడుగుల‌ ఎత్తు, 12.5 టన్నుల బరువు కలిగి ఉండేదని తెలిపారు. ఈ స్టెగోడాన్ జాతి ఏనుగుల అవ‌శేషాలు గ‌తంలో నర్మదా నది ఉపనది ప్రాంతంలోనూ, ప్ర‌పంచంలో నాలుగైదు ప్ర‌దేశాల్లో మాత్ర‌మే ల‌భించాయి. సింగరేణిలో లభ్యమైన స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాలలో ఒక జత దంతాలను బిర్లా మ్యూజియం వారికి తాజాగా అందజేయగా, మరొక జత దంతాలను నెహ్రూ జూలాజికల్ పార్క్ వారికి గ‌తంలోనే సింగరేణి యాజమాన్యం అందజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement