టెన్త్‌లో ఈసారి 6 పేపర్లే!

6 Papers For TS Tenth Students For 2021 - Sakshi

కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన

ముఖ్యమంత్రితో చర్చించాక తుది నిర్ణయం 

జనవరి తొలి వారం లేదా సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష బోధన

టెట్‌ నిర్వహణపైనా దృష్టి సారించిన విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతిలో 11 ప్రశ్నపత్రాలకు బదులు ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష విద్యా బోధన లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఏప్రిల్‌/మేలో నిర్వహించే టెన్త్‌ పరీక్షల్లో ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేస్తామని ప్రతిపాదించింది. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్‌, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ సబ్జెక్టుల్లో రెండు పేపర్ల చొప్పున ఉండగా హిందీ మాత్రం ఒకే పేపర్‌ ఉంది. ఇకపై సబ్జెక్టుకు ఒక పేపరే ప్రశ్నపత్రం ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఇక ఇంటర్‌ పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించాలని యోచిస్తోంది. 

ముందుగా  9, 10 తరగతులకు... 
పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు. ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించాలని భావించినా ప్రస్తుత చలికాలంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ప్రత్యక్ష విద్యా బోధనపై నిర్ణయం తీసుకోలేదన్నారు. జనవరి మొదటి వారంలో లేదా సంక్రాంతి తర్వాత 9వ తరగతి నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని, దీనిపై సీఎం కేసీఆర్‌తో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. 9, 10 తరగతుల వారికి కనీసం మూడు నెలలపాటు ప్రత్యక్ష బోధన ఉండేలా చూస్తామన్నారు. వాటితోపాటు జూనియర్‌ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి చర్యలు చేపడతామన్నారు. ఆ తరువాత దశలవారీగా కింది తరగతుల వారికి ప్రత్యక్ష బోధనకు నిర్ణయం తీసుకోనున్నారు. యూనివర్సిటీల వీసీల నియామకాలకు సంబం ధించిన ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో∙నియామకాలు చేపడతామన్నారు. (చదవండి: 33 సార్లు ఫెయిల్‌.. కరోనాతో పాస్‌)

ఆన్‌లైన్‌లో టెట్‌? 
టీచర్‌ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అంతకంటే ముందుగానే టెట్‌ నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే ఈసారి టెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా సీఎం ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top