Dengue Cases In Telangana: రాష్ట్రంలో 5,263 డెంగీ కేసులు

5263 dengue cases in the state - Sakshi

గతేడాదికంటే తక్కువే: వైద్య మంత్రి హరీశ్‌రావు

వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా అందుతున్న సేవల పట్ల మంత్రి అసంతృప్తి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు తక్కువగా నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతేడాది జనవరి నుంచి సెపె్టంబర్‌ వరకు 7,988 డెంగీ కేసులు నమోదైతే, ఈ ఏడాది అదే సమయానికి 5,263 కేసులు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధుల పరిస్థితిపై మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందని, అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా గడిచిన వారం పది రోజుల సమయంలో ఫీవర్‌ కేసుల్లో స్వల్పంగా పెరుగుదల ఉన్నట్లు పేర్కొన్నారు.

మరింత అప్రమత్తంగా ఉంటే ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడం సాధ్యమవుతుందన్నారు. మలేరియా, డెంగీ కేసుల విషయంలో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, జ్వర లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల చికిత్సకు అవసరమైన అన్ని మందులు పల్లె దవాఖానాలు మొదలుకొని అన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యాధి నిర్ధారించే ఎన్‌ఎస్‌1 కిట్స్, ఐజీఎం కిట్లకు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ డయాగ్నొస్టిక్‌ ద్వారా 24 గంటల్లో వైద్య పరీక్ష ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ చికిత్స పేరుతో ప్రజలను మభ్యపెడుతూ, ప్లేట్లెట్స్‌ ఎక్కించాలంటూ భయపెడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి ఆసుపత్రుల పట్ల జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా అందుతున్న సేవల పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెల్‌నెస్‌ సెంటర్లను సందర్శించి, అందుతున్న వైద్య సేవలను పరిశీలించాలని ఆరోగ్యశ్రీ సీఈవోను మంత్రి ఆదేశించారు. జూమ్‌ ద్వారా జరిగిన ఈ సమీక్షలో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్‌ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానాల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top