
మొయినాబాద్: ఓ ఫామ్ హౌస్‌లో విదేశీయులు నిర్వహిస్తున్న బర్త్ డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఓటీ, మొయినాబాద్ పోలీసులు దాడి చేసి 51 మందిని పట్టుకున్నారు. వీరి నుంచి హుక్కా, విదేశీ మద్యం స్వా«దీనం చేసుకున్నారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన మొయినాబాద్ మండలం బాకారం రెవెన్యూలోని ఎస్‌కే నేచర్ రీట్రీట్ ఫాంహౌస్‌లో గురువారం రాత్రి జరిగింది. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉగాండా, కెన్యా, లిబేరియా, నైజీరియా, క్యామరోన్ దేశాలకు చెందిన 51 మంది విదేశీయులు కొంత కాలంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంది.
మమా అనే మహిళ బర్త్‌డే సందర్భంగా అందరికీ పార్టీ ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో ఫామ్ హౌస్‌ను బుక్‌చేసింది. వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం అందరూ ఇక్కడికి చేరుకున్నారు. రాత్రి 11.30 గంటలకు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులతో కలిసి దాడి చేశారు. 20నుంచి 35 ఏళ్ల వయసున్న 37 మంది మహిళలు, 14 మంది పురుషులను పట్టుకున్నారు. ఫాంహౌస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి గురువారం రాత్రి 11.30 నుంచి శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు లోపలే ఉంచి తనిఖీలు చేశారు.
హుక్కా, విదేశీ మద్యం..
ఫాంహౌస్‌లో బర్త్ డే పార్టీ నిర్వహిస్తున్న విదే శీయులు ఎలాంటి అనుమతి లేకుండా హుక్కా, విదేశీ మద్యం వినియోగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. వీరినుంచి హుక్కాతోపాటు 20 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లు, 65 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం ఉండటంతో కొంత మందికి నార్కోటెక్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురు మహిళలకు పాజిటివ్ వచి్చనట్లు తెలిసింది. తనిఖీల్లో డ్రగ్స్ దొరకలేదు. పాజిటివ్ వచి్చన ముగ్గురు మహిళలు గతంలో డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీ..
పట్టుబడిన వారిని శంషాబాద్ విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. శుక్రవారం ఉదయం ఫాంహౌస్‌కు వచ్చి వీసా, పాస్‌పోర్టులు పరిశీలించారు. అయితే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న విదేశీయులు వీరికి సహకరించనట్లు తెలిసింది. అధికారులకు తప్పుడు వివరాలు చెప్పినట్లు సమాచారం. పట్టుబడిన వారిలో 15 మంది నగరంలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పత్రాలు సరిగా లేకుండా వీసా గడువు ముగిసిన 36 మందిని వారి స్వదేశాల పంపించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనుమతి లేకుండా ఫామ్‌హౌస్‌ను అద్దెకు ఇచి్చన నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.