TS: విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ

Ragijava as breakfast for students in telangana - Sakshi

20న విద్యా దినోత్సవం నుంచి ప్రారంభం

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

ఆధునీకరించిన వెయ్యి పాఠశాలల ప్రారంభోత్సవం

విద్యార్థులకు నోటు పుస్తకాలు.. టీచర్లకు ట్యాబ్‌లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 20న నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం మొదలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ అందించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతిరోజూ ప్రార్థనా సమయానికి ముందు విద్యార్థులకు 250 మిల్లీలీటర్ల చొప్పున రాగిజావ ఇస్తారని చెప్పారు. దీనివల్ల 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,26,907 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. గురువారం తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును మంత్రి సమీక్షించారు.

తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మన ఊరు..మన బడి’, ‘మన బస్తీ.. మన బడి’కింద సకల వసతులతో ఆధునీకరించిన వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను మంత్రులు, శాసనసభ్యులు ప్రారంభిస్తారని సబిత తెలిపారు. రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్న 16,27,457 మంది విద్యార్థులకు మూడేసి చొప్పున వర్క్‌ బుక్స్, ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న 12,39,415 మంది విద్యార్థులకు సబ్జెక్టుకు ఒక్కో నోటు పుస్తకం చొప్పున అందించనున్నామన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు, సమాచార బదలాయింపు కోసం రాష్ట్రంలోని 20 వేల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 1,600 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 4,800 డిజిటల్‌ తరగతులను విద్యా దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే 10 వేల గ్రంథాలయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు మొదలు వర్సిటీల వరకు విద్యా దినోత్సవం రోజున సభలు, సమావేశాలు నిర్వహించాలని, రాష్ట్రంలో విద్యా రంగంలో సాధించిన విజయాలను వివరించాలని సూచించారు.  

రూ.190 కోట్లతో పాఠ్య పుస్తకాలు 
రూ.190 కోట్లు వ్యయం చేసి 30 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామని, ఈ పుస్తకాలను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించామని మంత్రి సబిత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 26 లక్షల మంది విద్యార్థులకు రూ.150 కోట్లు వెచి్చంచి ఒక్కో విద్యారి్థకి రెండేసి జతల చొప్పున యూనిఫామ్‌లు అందిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top