లాసెట్‌లో 80.21 శాతం పాస్‌ | Prof Limbadri released the results of TS Lawset | Sakshi
Sakshi News home page

లాసెట్‌లో 80.21 శాతం పాస్‌

Jun 16 2023 3:34 AM | Updated on Jun 16 2023 3:34 AM

Prof Limbadri released the results of TS Lawset - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి గత నెల ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ లాసెట్‌–2023) ఫలితాలను ఉన్నత విద్య మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి గురువారం విడుదల చేశారు. వివరాలను ఆయన మీడియాకు వివరించారు.

ఈ పరీక్షకు 43,692 మంది దరఖాస్తు చేసుకోగా, 36,218 మంది పరీక్ష రాశారని, ఇందులో 29,049 (80.21 శాతం) మంది అర్హత సాధించారని తెలిపారు. మొత్తం 120 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం, ఇతరులకు 35 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలో 7,560 లా సీట్లున్నాయి.

ఇందులో మూడేళ్ల లా కోర్సుల్లో 4,630, ఐదేళ్ల లా కోర్సులో 2 వేలు, పీజీ లా కోర్సులో 930 సీట్లున్నాయి. త్వరలో లాసెట్‌ కౌన్సెలింగ్‌ చేపడతామని లింబాద్రి వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్, లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

60 ఏళ్లు పైబడిన వాళ్లుకూడా... 
న్యాయవాద వృత్తి చేపట్టాలనే ఆకాంక్ష 16 ఏళ్ల నుంచి 60 ఏళ్లు పైబడిన వాళ్లలోనూ కనిపించింది. 60 సంవత్సరాలకు పైబడి మూడేళ్ల లాసెట్‌ రాసిన వాళ్లలో 185 మందికిగాను 149 మంది, ఐదేళ్ల లాసెట్‌లో 10కి 9 మంది, పీజీ లాసెట్‌లో 68 మందికి 65 మంది ఉత్తీర్ణులయ్యారు.

అలాగే మూడేళ్ల లాసెట్‌ రాసిన వాళ్లలో బీకాం నేపథ్యం ఉన్నవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. బీకాం ప్రధాన కోర్సుగా ఉన్నవాళ్లు 8,164 మంది పరీక్ష రాయగా 5,861 మంది అర్హత సాధించారు. ఆ తర్వాత స్థానంలో బీఎస్సీ, బీటెక్‌ నేపథ్యం వాళ్లున్నారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వాళ్లు 53 మంది లాసెట్‌ రాశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement