
స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాత సెలక్షన్ లిస్ట్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం డీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియాకానికి డీఎస్సీ–2025 నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఖాళీలకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు చేసుకున్నారు. వారికి జూన్ 6వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకూ 23 రోజులపాటు పరీక్షలు నిర్వహించారు.
ఇటీవల తుది కీ విడుదల చేయగా అందులో పలు తప్పులు ఉన్నాయని పలువురు అభ్యర్థులు ఫిర్యాదులు చేశారు. వాటిని పరిశీలించి సవరించిన తుది కీ ఆధా రంగా డీఎస్సీ ఫలితాలను విడుదల చేసినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను, స్కోర్ కార్డులను పొందవచ్చని, స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాత తుది ఎంపిక జాబితా (సెలక్షన్ లిస్ట్) ప్రకటిస్తామని వివరించారు. ఈ ప్రక్రియ ఈ నెల 20 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా, తుది కీపై వచ్చిన అభ్యంతరాలకు ఎటువంటి వివరణ ఇవ్వకుండానే ఫలితాలు విడుదల చేసినట్లు విమర్శలు రావడం గమనార్హం. కాగా, https:// apdsc. apcfss. in సెట్‌లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి టెట్ వివరాలు సరిచేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినట్లు కన్వీనర్ తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 13వ తేదీ వరకే అందుబాటులో ఉంటుందని తెలిపారు.