సింగిల్‌ ‘టేక్‌’ శిల్పం

Artifact with barmateku log - Sakshi

బర్మాటేకు దుంగతో కళాఖండం 

ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు 

ప్రపంచంలో అతిపెద్దదని నిర్వాహకుల వెల్లడి 

కంటోన్మెంట్‌ (హైదరాబాద్‌):  ప్రపంచంలోనే అతిపెద్ద అనంత శేష శయన శ్రీ మహా విష్ణుమూర్తి ఏకాండీ బర్మా టేకు శిల్పాన్ని శనివారం మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. దీనికి బోయిన్‌పల్లిలోని అనూరాధ టింబర్‌ ఎస్టేట్స్‌ వేదికైంది. 21 అడుగుల పొడవు, ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన బర్మా టేకు దుంగతో చేసిన ‘అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి’ కళా ఖండానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

అప్పటి బర్మా (మయన్మార్‌) దేశ అడవుల్లో సుమారు 1,500 ఏళ్ల క్రితం బర్మా టేకు దుంగను ఆ దేశ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం వేలం వేసింది. అనూరాధ టింబర్స్‌ భారీ మొత్తం చెల్లించి ఈ దుంగను దక్కించుకుంది. చిత్రకారుడు గిరిధర్‌ గౌడ్‌తో పలు రేఖా చిత్రాలను రూపొందించి.. మయన్మార్‌ దేశ ప్రభుత్వం అనుమతితో అక్కడి శిల్పులతో కళాఖండాన్ని చెక్కించింది. అనంతరం కళాఖండాన్ని భారత్‌కు రప్పించి తుది మెరుగులు దిద్దించింది.

భగవద్గీతలోని 11వ అధ్యాయం 6వ శ్లోకం ఆధారంగా అనంత శేషశయన శ్రీ మహావిష్ణువుతో పాటు, శ్రీదేవి, భూదేవి చిత్రాలతో పాటు 84 చిన్న కళాఖండాల కలయికతో ఈ భారీ శిల్పాన్ని రూపొందించారు. కళాఖండాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అనురాధ టింబర్స్‌ నిర్వాహకులు చదలవాడ సోదరులు బర్మా టేకుతో అద్భుత కళాఖండాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top