2,878 పరీక్ష కేంద్రాలు... 39,600 మంది ఇన్విజిలేటర్లు | Sakshi
Sakshi News home page

2,878 పరీక్ష కేంద్రాలు... 39,600 మంది ఇన్విజిలేటర్లు

Published Fri, Jun 30 2023 3:37 AM

All prepared for tomorrows group 4 exam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్‌–4 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒకవైపు అత్యధిక సంఖ్యలో పోస్టులు... మరోవైపు అత్యధిక సంఖ్యలో అభ్యర్థులుండటంతో టీఎస్‌పీఎస్సీ వ్యూహాత్మక కార్యాచరణతో చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో 9 వేల గ్రూప్‌–4 ఉద్యోగ ఖాళీలున్నాయి. వీటికి 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... గురువారం రాత్రి వరకు 8.55 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 2,878 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్‌–4 పరీక్షల నిర్వహణకు కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక లైజన్‌ అధికారి, ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఉంటారు. ఈ పరీక్షా కేంద్రాల పరిధిలో దాదాపు 40 వేల పరీక్ష హాల్‌లలో అభ్యర్థులను సర్దుబాటు చేస్తారు. ఒక్కో పరీక్ష హాలులో గరిష్టంగా 24 మంది అభ్యర్థులుంటారు.

పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్ల పాత్ర కీలకం. దీంతో ఇన్విజిలేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ సైతం టీఎస్‌పీఎస్సీ ఇచ్చింది. జూలై 1న శనివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. 

పరీక్ష కేంద్రంలో పక్కాగా పరిశీలన... 
గ్రూప్‌–4 ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆశావహులు సైతం భారీగా ఉన్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల పరిశీలన, నిర్ధారణకు టీఎస్‌పీఎస్సీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇన్విజిలేటర్లకు సైతం నిర్ధారణ బాధ్యతలు అప్పగించింది. తొలుత పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే సమయంలో అభ్యర్థి హాల్‌టిక్కెట్‌తో పాటు గుర్తింపు కార్డులు పరిశీలిస్తారు. ఆ తర్వాత అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరు.

అభ్యర్థులకు కనీసం బెల్టు సైతం అనుమతించబోమని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే తేల్చి చెప్పింది. పరీక్ష హాలులో అభ్యర్థిని ఇన్విజిలేటర్‌ మరోమారు తనిఖీ చేస్తారు. హాల్‌ టికెట్‌లోని ఫోటో ద్వారా, అభ్యర్థి ఫోటో గుర్తింపు కార్డు ద్వారా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఓటీఆర్‌లో ఉన్న సంతకం ఆధారంగా అభ్యర్థి చేసిన సంతకాన్ని పరిశీలిస్తారు. నామినల్‌రోల్స్‌ పైన సంతకం తప్పనిసరి చేసింది. దీంతో పాటు అభ్యర్థి వేలిముద్రను పరీక్ష హాలులోనే సమర్పించాలి.

ఐదు పద్ధతుల్లో ఎక్కడ పొరపాటు గుర్తించినా అభ్యర్థిని పరీక్షకు అనుమతించమని టీఎస్‌పీఎస్సీ తేలి్చచెప్పింది. గ్రూప్‌–4 పరీక్ష ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు కమిషన్‌ తెలిపింది. ఓఎంఆర్‌ జవాబు పత్రంలో అభ్యర్థి ముందుగా హాల్‌టిక్కెట్‌ నంబర్, ప్రశ్నపత్రం కోడ్‌ను బబ్లింగ్‌ చేయాలి. ఓఎంఆర్‌ జవాబు పత్రంపై అభ్యర్థి హాల్‌టిక్కెట్‌ నంబర్, ఫోటో ఉంటాయని వస్తున్న ఊహాగానాలను పట్టించుకోవద్దని కమిషన్‌ ఇప్పటికే స్పష్టం చేసింది.  

తాళి తొలగిస్తే ఊరుకోం 
టీఎస్‌పీఎస్సీకి వీహెచ్‌పీ హెచ్చరిక 
సాక్షి, హైదరాబాద్‌: పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థినుల నుంచి మంగళ సూత్రాలను తొలగిస్తే ఊరుకునేది లేదని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) టీఎస్‌పీఎస్సీని హెచ్చరించింది. రకరకాల నిబంధనలతో హిందువులను అవమానిస్తే ఊరుకునేది లేదని, సంప్రదాయాలను మంటగలిపే దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని పేర్కొంది.

ఈ మేరకు గురువారం టీఎస్సీపీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్‌ పగుడాకుల బాలస్వామి, బజరంగ్‌ దళ్‌ రాష్ట్ర కన్వినర్‌ శివ రాములు తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement