కెరటమై ఎగిసి.. అంతలోనే కనుమరుగై..! | - | Sakshi
Sakshi News home page

కెరటమై ఎగిసి.. అంతలోనే కనుమరుగై..!

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్‌. బాబు కన్నుమూత

టీవీకే వర్గాల దిగ్భ్రాంతి గవర్నర్‌ అర్లేకర్‌, సీఎం విజయ్‌, మాజీ సీఎం స్టాలిన్‌ సంతాపం నేటి సీఎం తిరుచ్చి పర్యటన రద్దు

సాక్షి, చైన్నె: శాసనసభ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో సెప్టెంబర్‌ 9వ తేదీ రాత్రి కొళత్తూరు ఎమ్మెల్యే వి.ఎస్‌. బాబుకు తీవ్ర శ్వాసకోశ సమస్య తలెత్తింది. దీంతో వెంటనే చైన్నె నెల్సన్‌ మాణికం రోడ్డులోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుండి ఆయన ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌ సాయంతో బహుళ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్‌ 23న సీఎం విజయ్‌ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య వివరాలు వెల్లడించాలంటూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైన నేపథ్యంలో చికిత్స ఫలించక గురువారం ఆయన మరణించినట్లు ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది.

వి.ఎస్‌. బాబు రాజకీయ ప్రస్థానం

ఉత్తర చైన్నె డీఎంకేలో ఒకప్పుడు శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన వి.ఎస్‌. బాబు, ఉత్తర చైన్నె జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో పురసైవాక్కం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2011లో పురసైవాక్కం స్థానంలో కొళత్తూరు నియోజకవర్గం ఏర్పాడింది. ఇక్కడ తొలి సారిగా పోటీ చేసిన ఎం.కె. స్టాలిన్‌ విజయం కోసం ఆయన కృషి చేశారు. ఆతదుపరి ఆ నియోజకవర్గానికి అన్ని తానే అన్నట్టుగా వ్యవహరించారు. ఆ తదుపరి పరిణామాలతో డీఎంకేను వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2011 ఎన్నికల తర్వాత డీఎంకేలో నెలకొన్న అంతర్గత పరిణామాలతో విభేదించిన ఆయన, పార్టీని వీడి అన్నాడీఎంకేలో చేరారు. జయలలిత మరణానంతరం, 2017 ఆర్‌.కె. నగర్‌ ఉప ఎన్నికల సమయంలో టీటీవీ దినకరన్‌కు మద్దతు పలికారన్న కారణంతో 2018లో ఆయనను అన్నాడీఎంకే నుండి బహిష్కరించారు. ఆ తర్వాత తిరిగి అన్నాడీఎంకేలో చేరినప్పటికీ ఆశించిన గుర్తింపు లభించలేదు.

టీవీకేలో చేరి చారిత్రక విజయం

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన టీవీకేలో చేరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కొళత్తూరు నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. అప్పటి సీఎం ఎంకే స్టాలిన్‌కు ప్రత్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసిన ఆయన చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. కొళత్తూరు నియోజకవర్గం నుండి డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌పై పోటీ చేసి విజయం సాధించడం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అందరూ ఆయన్ని వీఎస్‌ బాబు, పురసై బాబు అని పిలిచినా ఆయన అస్సలు పేరు మాత్రం వి సుందరం పిళ్‌లైబాబు అన్నది ఎవ్వరికి తెలియదు. ఆయన మరణ సమాచారంతో టీవీకే వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.

ఎం.కె. స్టాలిన్‌, ఉదయనిధి స్టాలిన్‌ సంతాపం

ఆసుపత్రిలో సుదీర్ఘకాలం చికిత్స పొందుతున్న వి.ఎస్‌. బాబు ఆరోగ్యం మెరుగుపడుతోందన్న వార్తలు వస్తున్న తరుణంలో ఆయన మరణవార్త వినడం దిగ్భ్రాంతి కలిగించిందని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి, పార్టీ శ్రేణులకు సానుభూతి తెలిపారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ కూడా బాబు మృతి పై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్‌, బీజేపీ నేత నైనార్‌ నాగేంద్రన్‌, పీఎంకే నేత అన్బుమణి రాందాస్‌ వేర్వేరు ప్రకటనల్లో వి.ఎస్‌. బాబు మృతిపై సంతాపం తెలిపారు. ప్రజా సేవకు అంకితమైన సీనియర్‌ నాయకుడిని కోల్పోయామని, ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు. కాగా వీఎస్‌ బాబు మృతి నేపథ్యంలో శుక్రవారం సీఎం విజయ్‌ తిరుచ్చి పర్యటన రద్దు చేశారు. శుక్రవారం వీఎస్‌బాబు అంత్యక్రియలు జరగనున్నాయి.

ఆరుకు చేరిన ఖాళీల సంఖ్య

ఇప్పటికే రాష్ట్రంలో తిరుచ్చి తూర్పు, విరాళిమలై, కరూర్‌, పెరుంతురై, అంబా సముద్రం అసెంబ్లీ స్థానాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. ఇందులో తిరుచ్చితూర్పు సీఎం విజయ్‌ రెండు చోట్ల గెలవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. మిగిలిన నాలుగు స్థానాలు అన్నాడీఎంకే నుంచి గెలిచి పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరిన వారు ఉన్నారు. ఈ ఐదు స్థానాలకు ఉప ఎన్ని కలు జరగాల్సి ఉంది. ఈ పరిస్థితులలో వీఎస్‌ బాబు మరణంతో కొళత్తూరు అసెంబ్లీ స్థానం సైతం ఖాళీ అయింది. దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 6కు చేరింది.

గత ఎన్నికల్లో అప్పటి సీఎం స్టాలిన్‌ను ఓడించి పెనుసంచలనం సృష్టించిన కొళత్తూరు ఎమ్మెల్యే బాబు (75)

గురువారం కన్నుమూశారు. గత 72 రోజులకు పైగా చైన్నెలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన మధ్యాహ్నం 2.24 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ సమాచారంతో టీవీకే వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి.

సీఎం విజయ్‌ నివాళి

ఎమ్మెల్యే వీఎస్‌ బాబు పార్తీవ దేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఆసుపత్రి వద్దకు పోటెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీవీకే వర్గాలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. సీఎం విజయ్‌ సైతం అక్కడికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో భద్రత నడుమ పార్తీవ దేహాన్ని కొళత్తూరులోని వీఎస్‌ బాబు నివాసానికి తరలించారు.

విజయ్‌, స్టాలిన్‌ సహా పలువురు నేతల సంతాపం

ఎమ్మెల్యే వి.ఎస్‌. బాబు మృతి సమాచారంతో తమిళనాడు గ వర్నర్‌ అర్లేకర్‌, సీఎం విజయ్‌, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ సహా వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి ప్రజా జీవితానికి తీరని లోటని పేర్కొంటూ సంతాప సందేశాలు విడుదల చేశారు. సీఎం విజయ్‌ స్పందిస్తూ ప్రజలతో మమేకమై అందరి ఆదరాభిమానాలు, నమ్మకాన్ని పొందిన వి.ఎస్‌. బాబు ఆకస్మిక మరణం పూడ్చలేని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్న ఆయన కుటుంబానికి, టీవీకే కార్యకర్తలకు , కొలత్తూరు నియోజకవర్గ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మంత్రి ఆధవ్‌ అర్జున స్పందిస్తూ, వి.ఎస్‌. బాబు ఉత్తర చైన్నె ముఖచిత్రం అని, కష్టసమయాల్లోనూ చిరునవ్వుతో ఉండేవారని కొనియాడారు. పార్టీ కష్టకాలంలో తమ అధినేత విజయ్‌తో కలిసి పనిచేశారని, తనను సొంత కొడుకులా చూసుకున్నారని గుర్తు చేశారు. ఉత్తర చైన్నె ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆయన మరణం మొత్తం చైన్నె నగరానికి తీరని నష్టమని నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement