– మంత్రి వన్నియరసుపై కర్ణాటక ప్రభుత్వం కన్నెర్ర
– విచారణకు ఆదేశం
సాక్షి, చైన్నె: బండిపూర్ టైగర్ రిజర్వ్ అడవిలో సఫారీ సందర్భంగా అటవీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు సాంఘిక న్యాయ శాఖ మంత్రి వన్నియరసుపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేసింది. మంత్రి వన్నియరసు నవంబర్ 10, 11 తేదీలలో జిల్లాలో పర్యటించిన అనంతరం ముదుమలై, పరిసర అటవీ ప్రాంతాల్లో సఫారీకి వెళ్లారు. ఆయన, కుటుంబ సభ్యులు, వివాహ నిర్వాహకురాలు విద్యతో కలిసి అటవీ ప్రాంతంలో నడవడం, పరుగెత్తడం, అటవీ శాఖ వాహనంలో ప్రయాణించడం వంటి దృశ్యాలు ఉన్న రీల్స్ వెలుగులోకి వచ్చాయి. పొదల్లో విశ్రాంతి తీసుకుంటున్న పులిని తరిమికొట్టినట్లు, బండిపూర్ టైగర్ రిజర్వ్‌లో అటవీ శాఖ వాహనంలో ఏనుగుకు అత్యంత సమీపంగా వెళ్లినట్లు ఆ వీడియోల్లో కనిపించడం తీవ్ర వివాదానికి దారితీసింది. వన్యప్రాణుల భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించారంటూ పలు రాజకీయ పార్టీల నేతలు ఈ దృశ్యాలను ఖండించారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ కమిషనన్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
కర్ణాటక ప్రభుత్వం స్పందన :బండిపూర్ టైగర్ రిజర్వ్‌లో కర్ణాటక అటవీ శాఖ వాహనంలో మంత్రి వన్నియరసు అడవి ఏనుగును సమీపించిన వీడియోపై కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి విచారణకు ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోని నియమ నిబంధనలు హోదాతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తాయని, వాటిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది.


