సాక్షి, చైన్నె: తమిళనాడులోని అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలో అసంతప్తితో ఉన్న ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి ప్రతిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేలు రహస్య చర్చలు జరుపుతున్నాయంటూ ఇంటెలిజెన్స్ నివేదిక ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం విజయ్ దృష్టికి చేరింది. దీంతో అప్రమత్తమైన ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. ఈ పరిణామాలతో తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆయన, పార్టీ వ్యవహారాల పూర్తి బాధ్యతలను ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ మంత్రి పుస్సీ ఆనంద్‌కు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే 98 చోట్ల గెలిచింది. ఇందులో సీఎం విజయ్ రెండు చోట్ల గెలిచి, చివరకు ఓ చోట రాజీనామాచేశారు. ఆయన తదుపరి పార్టీలో కీలకంగా ఉన్న ఆనంద్, ఆదవ్, సెంగోట్టయ్యన్, అరుణ్ రాజ్, నిర్మల్‌కుమార్‌లు సైతం గెలిచి ప్రభుత్వ పరంగా కీలక బాధ్యతలో ఉన్నారు. ఇక, మిగిలిన మంత్రులుగా పార్టీకి , విజయ్‌కు విధేయులుగా ఉన్న వారికి అవకాశం కల్పించడమే కాకుండా మిత్ర పక్షాలకు సైతం పద వులు కట్ట బెట్టారు. అయితే, సుమారు 70 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు, ఏమి చేస్తున్నారో? అన్న పరిస్థితి. కీలక మంత్రుల్ని, చివరకు సీఎం విజయ్‌ను సైతం కలవలేని స్థితిలో వీరు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరిలో ఎక్కువ శాతం మంది విజయ్ అభిమానే ఉన్నా, ఇతర పార్టీల నుంచి చివరి క్షణంలో చేరి ఎమ్మెల్యేలైన వాళ్లు ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా త్వరలో డీఎంకే పాలన అంటూ స్టాలిన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అసెంబ్లీని సమావేశ పరిచిన పక్షంలో విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పె ట్టవచ్చు అన్న చర్చ జరుగుతోంది. అదే సమ యంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెర మీదకు రావడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ పరిణామాల తదుపరి కూడా అసంతృప్తి అన్నది తగ్గలేదు.
అసంతృప్తికి కారణాలు
సీఎం విజయ్‌ను తాము నేరుగా కలవలేకపోవడం, కొందరు వ్యక్తులు అడ్డుకోవడం, నియోజకవర్గ సమస్యలపై చర్చించే అవకాశం దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని నిఘా వర్గాల నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. దీనిని ఆసరాగా చేసుకుని డీఎంకే, అన్నాడీఎంకేలు వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయన్న నివేదికతో సీఎం విజయ్ అలర్ట్ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆనంద్‌కు పూర్తి స్వేచ్ఛ..
సీఎంగా తాను రాష్ట్ర పరిపాలన వ్యవహారాలలో బిజీగాఉండటంతో పార్టీపై విజయ్‌దృష్టి పెట్టడం లేదన్న చర్చ జరుగుతూ వచ్చింది. ఈ పరిణామాలతో తాజాగా పార్టీ పరంగా పూర్తి నిర్ణయాలు తీసుకునే అధికారం, స్వేచ్చను ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌కు అప్పగించినట్టు సంకేతాలు వెలు వడ్డాయి. ఇకపై పార్టీ పూర్తి బాధ్యతను ఆయనకే అప్పగించడం. ఎవరి జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే విధంగా అధికారాలు అప్పగించడం గమనార్హం. అదే సమయంలో నిఘా వర్గాల నివేదిక ప్రకారం, క్షేత్రస్థాయిలో కొందరు నిర్వాహకుల తీరు వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్న అంశం కూడా చర్చకు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో, త్వరలోనే టీవీకే జిల్లా కార్యదర్శులు, యూనియన్ కార్యదర్శులతో భారీ సంప్రదింపుల సమావేశం నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే నిర్వాహకులకు గట్టి హెచ్చరికలు జారీ చేయాలని సీఎం విజయ్ నిర్ణయించి ఉన్నట్టు పార్టీ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ చేజారకుండా ఉండే రీతిలో ఇక వారితో ఆనంద్ సంప్రదింపులలో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం విశేషం. తాను అందుబాటులో లేకున్నా, ఆనంద్ ద్వారా ఎలాంటి సమస్యలనైనా తీసుకెళ్లి పరిష్కరించుకునే రీతిలో ఎమ్మెల్యేలకు విజయ్ సందేశాలు పంపించినట్టు సమాచారం.


