తమిళసినిమా: ఇంతకు ముందు వడివేలు కథానాయకుడిగా 23 ఆమ్ పులికేసీ,ఇరుంబు కోట్టై ముట్టు సింగం, పులి, కచడటపర, బోట్ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శింబుదేవన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం నవోరియా. టీపీసీ డ్రీమ్ హౌస్ పతాకంపై తిరుకుమరన్ శక్తి వేల్ నిర్మించిన ఈ చిత్రానికి శింబుదేవన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మాణం భాగస్వామ్యం పంచుకుంది. విమల్ హీరోగా నటించిన ఇందులో నటి ఆన్ షీత్తల్ హీరోయిన్‌గా నటించారు. నటుడు ఆరి అర్జున్, తంబి రామయ్య, బాలా శరవణన్,నిళల్ గళ్ రవి, బాలాజీ శక్తి వేల్, మన్సూర్ అలీఖాన్, కస్తూరి, అప్పు కుట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర షూటింగ్ ను తిరునెల్వెల్లి,కోవిల్ పట్టి,తెన్ కాశీ,శంకరన్ కోవిల్ ప్రాంతంల్లో 60 రోజులకు పైగా నిర్వహించి పూర్తి చేసినట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా చిత్రంలోని ముఖ్యమైన సన్నివేశాలను చైన్నెలోని ప్రసాద్ స్టూడియోలో బ్రహ్మాండ సెట్ వేసి చిత్రీకరించినట్లు చెప్పారు. కామెడీ యాక్షన్ ఫాంటసీ నేపధ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని చెప్పారు. ఇది నటుడు విమల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుందని, ఆయనకు చాలా ముఖ్యమైన చిత్రం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.డీ.ఇమాన్ సంగీతాన్ని,ఎం.శివకుమార్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని డిసెంబర్ నెలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.


