అవిశ్వాసం ఎదుర్కొనేందుకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

అవిశ్వాసం ఎదుర్కొనేందుకు సిద్ధం

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

– మంత్రి సెంగోట్టయ్యన్‌

సాక్షి, చైన్నె : తమ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దానిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సెంగోట్టయ్యన్‌ స్పష్టం చేశారు. గురువారం గోపిచెట్టిపాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం విజయ్‌ అధ్యక్షతన జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఎవరి నుంచీ ఎలాంటి అసమ్మతి లేఖలు అందలేదని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదని, కేవలం మీడియా మాత్రమే ఇలాంటి ఊహాగానాలు ప్రచారం చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ ప్రతిపక్షాలు తీర్మానం తీసుకొచ్చినా అసెంబ్లీలో దానిని ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలను పిలిచి వారి నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి అడగడం సాధారణ ఆనవాయితీ అని ఆయన తెలిపారు. బుధవారం మహాబలిపురంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో సీఎం విజయ్‌ నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఎమ్మెల్యేల నుండి ఎలాంటి లేఖ అందలేదని, ఆ వార్తల్లో నిజం లేదని ఆయన ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, తగిన సమయంలో ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని సెంగోట్టయ్యన్‌ వెల్లడించారు.

ఎస్పీని ఆశ్రయించిన

సినీ నటి షర్మిలి దంపతులు

సాక్షి, చైన్నె: రూ. 15 కోట్ల విలువైన తమ వాణిజ్య ఆస్తిని నకిలీ పత్రాలతో ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీ నటి షర్మిలి దంపతులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఆమె తన భర్త చొక్కనాథన్‌తో కలిసి రామనాథపురం జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు. ఆవరంబూతో పాటు పలు తమిళ చిత్రాలలో నటించిన షర్మిలి, ఆమె భర్త చొక్కనాథన్‌కు రామనాథపురం పట్టణంలోని బజార్‌ ప్రాంతంలో సుమారు రూ. 15 కోట్ల విలువైన వాణిజ్య ఆస్తి ఉంది. అయితే, కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమిని అక్రమంగా కబ్జా చేశారని చొక్కనాథన్‌ మూడు నెలల క్రితం జిల్లా ఎస్పీ , దక్షిణ మండల (సదరన్‌ జోన్‌) ఐజీలకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన జిల్లా క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు, ఈ నెల 5వ తేదీన రామనాథపురానికి చెందిన బాలకృష్ణన్‌, చంద్రశేఖర్‌, మహేశ్వరన్‌ , నాగేశ్వరన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని, కబ్జాకు గురైన తమ ఆస్తిని తిరిగి ఇప్పించాలని కోరుతూ నటి షర్మిలి దంపతులు నేరుగా ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు.

6 నెలల్లోగా అన్ని స్టేషన్లలో

బ్యాటరీ కార్‌ సౌకర్యం

– మదురై హైకోర్టు కీలక ఆదేశం

సాక్షి, చైన్నె : వృద్ధులు, దివ్యాంగుల ప్రయాణ కష్టాలను తొలగించేలా మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే ఆరు నెలల్లోగా అన్ని రైల్వే స్టేషన్లలో బ్యాటరీ కార్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని రైల్వే శాఖను ఆదేశించింది. తంజావూరుకు చెందిన విమలనాథన్‌ హైకోర్టు మదురై బెంచ్‌లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 2017లో తిరుచ్చి రైల్వే స్టేషన్‌లో ప్రవేశపెట్టిన బ్యాటరీ కార్‌ సేవలను మొదట్లో ఉచితంగా అందించారని, కానీ 2018 నుండి ప్రయాణికుల వద్ద ఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. మదురై రైల్వే స్టేషన్‌లో ఈ సేవను ఉచితంగా అందిస్తుండగా, తిరుచ్చిలో మాత్రం రుసుము వసూలు చేయడం సరికాదని తెలిపారు. మదురై, తిరుచ్చి రైల్వే డివిజన్ల పరిధిలో మొత్తం 251 రైల్వే స్టేషన్లు ఉండగా, కేవలం 11 స్టేషన్లలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే బోర్డు మార్గదర్శకాల ప్రకారం దివ్యాంగులు, వృద్ధులు, అవసరమైన వారికి బ్యాటరీ కార్‌ సేవలను ఉచితంగా అందించాల్సి ఉన్నందున, తిరుచ్చి స్టేషన్‌లోనూ ఉచిత సేవలు పునరుద్ధరించాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ వేల్మురుగన్‌, జస్టిస్‌ రామకృష్ణన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని రైల్వే స్టేషన్లలో బ్యాటరీ కార్‌ సదుపాయం ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన న్యాయమూర్తులు, 6 నెలల గడువులోగా అన్ని స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement