మాజీ ఎమ్మెల్యే ముత్తుకుమార్‌కు కస్టడీ | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే ముత్తుకుమార్‌కు కస్టడీ

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

● ప్రత్యేక కోర్టు ఆదేశం

సాక్షి, చైన్నె : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 400 కోట్ల ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపు లంచం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముత్తుకుమార్‌ను 5 రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ చైన్నె ప్రత్యేక కోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.గత డీఎంకే ప్రభుత్వ హయాంలో వెయ్యికి పైగా ప్రైవేట్‌ పాఠశాలలకు శాశ్వత గుర్తింపు, ఇతర అనుమతులు ఇప్పిస్తామని నమ్మించి సుమారు రూ. 400 కోట్లకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రైవేట్‌ పాఠశాలల సమాఖ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైన్నె సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌, తమిళనాడు ప్రైవేట్‌ పాఠశాలల సంఘం అధ్యక్షుడు పి.డి. అరసకుమార్‌, , మాజీ ఎమ్మెల్యే ముత్తుకుమార్‌ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌ అరెస్ట్‌ కాగా, ముత్తుకుమార్‌ అక్టోబర్‌ 29న అవినీతి నిరోధక కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎల్‌.ఎస్‌. సత్యమూర్తి ఎదుట లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

5 రోజుల విచారణకు అనుమతి..

సమగ్ర దర్యాప్తు కోసం ముత్తుకుమార్‌ను కస్టడీకి ఇవ్వాలని సీసీబీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జడ్జి సత్యమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. మధ్యాహ్నం 1 గంట నుండి ఈనెల 16వ తేదీ వరకు ఆయన్ను పోలీస్‌ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించారు. విచారణ సమయంలో ముత్తుకుమార్‌ తరపు న్యాయవాదిని గమనించేందుకు అనుమతించాలని, నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ శారీరకంగా గానీ, మానసికంగా గానీ వేధించకూడదని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.పోలీస్‌ కస్టడీ ముగిసిన తర్వాత నవంబర్‌ 16 ఉదయం తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశిస్తూనే, తాజాగా ముగిసిన ఆయన జ్యుడిషియల్‌ కస్టడీని నవంబర్‌ 26వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

అన్బిల్‌ మహేష్‌ బెయిల్‌ పిటిషన్‌..

ఈ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌ బెయిల్‌ పిటిషన్‌పై స్పందించాలని మద్రాస్‌ హైకోర్టు చైన్నె సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులను ఆదేశించింది. ఈకేసులో చైన్నె అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం ఆయన్ను ఈనెల 18 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించగా, ఆయన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అన్బిల్‌ మహేష్‌ బెయిల్‌ కోసం మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.గురువారం జస్టిస్‌ వి. లక్ష్మీనారాయణన్‌ ఎదుట ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. సీసీబీ తరఫున రాష్ట్ర ప్రధాన క్రిమినల్‌ న్యాయవాది జాన్‌ సత్యన్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే ముత్తుకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించనున్నామని, మరో నిందితుడు శరవణన్‌ బుధవారం లొంగిపోయాడని కోర్టుకు తెలిపారు.ఈ దశలో బెయిల్‌ పిటిషన్‌పై పూర్తిస్థాయి వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని పోలీసుల తరఫు న్యాయవాది కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి, అన్బిల్‌ మహేష్‌ బెయిల్‌ దరఖాస్తుపై స్పందించాలని పోలీసు శాఖను ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 17వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement