సాక్షి, చైన్నె : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన జెమ్ గ్రానైట్స్ యజమాని వీరమణి పోక్సో కేసుల దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. వీరమణిపై నమోదైన మొదటి కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం మద్రాస్ హైకోర్టుకు నివేదించింది. మైనర్లపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జెమ్ గ్రానైట్స్ అధినేత వీరమణిపై మొత్తం తొమ్మిది పోక్సో కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులను నీరుగార్చేందుకు ఉన్నతాధికారులు ప్రయ త్నించారని, ఇందుకోసం లక్షలాది రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తూ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన వీడియోలను మీడియాలో ప్రసారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తులిర్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా కోర్టును ఆశ్రయించింది.
10 రోజుల్లో మరో రెండు ఛార్జిషీట్లు
జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్లు విచారణకు రాగా, సిట్ తరఫున ప్రధాన క్రిమినల్ న్యాయవాది జాన్ సత్యన్ వాదనలు వినిపించారు. తొలి కేసులో ఛార్జిషీట్ పూర్తయిందని, మిగిలిన రెండు కేసులలో మరో 10 రోజుల్లోగా ఛార్జిషీట్లు దాఖలు చేస్తామని కోర్టుకు స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన ప్రకాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, డబ్బు బదిలీకి సంబంధించి అతడిని విచారించాల్సి ఉందని సిట్ తెలిపింది. ప్రకాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 16న విచారణకు రానుంది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, విచారణను వేగవంతం చేసేందుకు ముగ్గురు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.సిట్ సమర్పించిన వివరాలను నమోదు చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీ నారాయణన్, తదుపరి విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేశారు.


