వేలూరు: తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని తామలేరి ముత్తూరు గాంధీనగర్‌కు చెందిన మనోహరన్ కుమారుడు గోవిందరాజ్(32) ఆయనకు భార్య కీర్తిక, నాలుగు సంవత్సరాల కుమారుడున్నారు. గోవిందరాజ్ గత ఎనిమిది సంవత్సరాలకు పైగా ఆర్మీ సిపాయిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 4న లద్దాఖ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతో పాటు కేరళ రాష్ట్రానికి చెందిన మరో సైనికుడు మృతి చెందారు. ఈ ఘటనతో గోవిందరాజ్ పార్థివ దేహాన్ని పోస్టు మార్టం కోసం ఆర్మీ ఆసుపత్రికి తరలించి అనంతరం భౌతిక కాయాన్ని విమానంలో చైన్నెకి తీసుకొచ్చి అక్కడ నుంచి ఆర్మీ వాహనంలో స్వగ్రామానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసి బంధువులు కన్నీరు మున్నీరు పెట్టారు. అనంతరం పార్థీవదేహం వద్ద ఆర్మీ సిబ్బంది పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించడంతో పాటు సైనిక గౌరవ సూచికగా 21 గన్ల సెల్యూట్ నిర్వహించారు. డిప్యూటీ తహశీల్దార్ సెల్వరాజ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇందులో జోలార్‌పేట మాజీ ఎమ్మెల్యే కేసీ వీరమణి, మాజీ ఎమ్మెల్యేలు దేవరాజ్ పాల్గొన్నారు.


