సాక్షి, చైన్నె: ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు మంజూరు కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అన్బిల్ మహేష్ బెయిల్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తన బెయిల్ అప్పీలును అత్యవసర విషయంగా విచారణకు స్వీకరించాలని కోరుతూ అన్బిల్ మహేష్ తరఫున సీనియర్ న్యాయవాది పి. విల్సన్ బుధవారం జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ధర్మాసనం ముందు హాజరై విజ్ఞప్తి చేశారు. దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించిన సాంకేతిక ప్రక్రియలన్నీ బుధవారం పూర్తయితే, గురువారం ఈ కేసును విచారణకు స్వీకరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు, అనుమతులు ఇప్పిస్తామనే నెపంతో రూ. 100 కోట్లు వసూలు చేశారనే తీవ్ర ఆరోపణలపై చైన్నె సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్టోబర్ 26న అన్బిల్ మహేష్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై నమోదైన ఆరోపణలకు మద్దతుగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంటూ ఇటీవల చైన్నె అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడమే కాకుండా, ఆయన జ్యుడీషియల్ కస్టడీని నవంబర్ 18 వరకు పొడిగించింది.అదే సమయంలో, ఈ కేసును పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ అన్బిల్ మహేష్ దాఖలు చేసిన మరొక పిటిషన్ విచారణను వాయిదా వేయాలని న్యాయవాది విల్సన్ అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తికి కోర్టు అంగీకరిస్తూ కేసు విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.
ప్రత్యేక కోర్టులో లొంగిపోయిన 6వ నిందితుడు..
ఈ పాఠశాలల అక్రిడిటేషన్ లంచం కేసులో ఆరో నిందితుడిగా ఉన్న శరవణన్ ఎట్టకేలకు చైన్నె ప్రత్యేక కోర్టు ముందు లొంగిపోయాడు. ఇప్పటివరకు పరారీలో ఉన్న శరవణనన్‌ను న్యాయమూర్తి ఎల్.ఎస్. సత్యమూర్తి ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శరవణన్ పరారీలో ఉన్నారనే కారణాన్ని చూపిస్తూనే గతంలో అన్బిల్ మహేష్ బెయిల్‌ను పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు శరవణన్ కూడా కస్టడీలోకి రావడంతో హైకోర్టులో జరగబోయే బెయిల్ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.


