అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు ప్రైవేటుకు..! | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు ప్రైవేటుకు..!

Nov 12 2026 3:24 AM | Updated on Nov 12 2026 3:24 AM

● టెండర్ల ఆహ్వానం ● రెండేళ్ల కాలానికి ఒప్పందాలు

సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాన్ని మరింత పారదర్శకంగా, సాంకేతికంగా మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కార్యక్రమాలను ప్రసారం చేసే కాంట్రాక్టు కోసం తమిళనాడు వార్తా విభాగం తాజాగా టెండర్‌ ప్రకటన జారీ చేసింది. ఈ ఒప్పందం జనవరి 2027 నుండి డిసెంబర్‌ 2028 వరకు రెండు సంవత్సరాల కాలానికి అమలులో ఉంటుంది. ఈ రెండేళ్లలో మొత్తం 160 రోజుల (ఏడాదికి 80 రోజుల చొప్పున) శాసనసభ కార్యకలాపాలను మల్టీ–కెమెరా సిస్టమ్‌ ద్వారా పూర్తిస్థాయిలో రికార్డ్‌ చేసి, పోస్ట్‌–ప్రొడక్షన్‌ పనుల అనంతరం టెలివిజన్‌ ఛానెళ్లకు తక్షణ ప్రసారం కోసం అందించాల్సి ఉంటుంది.

వివాదాల నేపథ్యంలో కొత్త నిబంధనలు

గతంలో అసెంబ్లీ ప్రసారాల సందర్భంగా సభా రికార్డుల నుంచి తొలగించిన కొన్ని వివాదాస్పద భాగాలు సోషల్‌ మీడియాలో వ్యాపించాయి. ఈ నేపథ్యంలో, అటువంటి తొలగించిన భాగాలను మినహాయించి సభా కార్యకలాపాలను ప్రసారం చేస్తామని అసెంబ్లీ స్పీకర్‌ జెసిటి ప్రభాకర్‌ ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ కొత్త టెండర్‌ నిబంధనలను రూపొందించారు. ఈమేరకు సభా రికార్డుల నుంచి తొలగించిన పదాలు లేదా భాగాలను పూర్తిగా తీసివేసిన తర్వాత మాత్రమే ప్రసారం కోసం ఛానెళ్లకు అందిస్తారు. ప్రత్యక్ష ప్రసారం సమయంలో దివ్యాంగుల కోసం సంకేత భాషా అనువాదం తప్పనిసరిగా అందించాలి. సభలో జరిగే అవాంఛనీయ సంఘటనలు, గందరగోళ దృశ్యాలను స్క్రీన్‌పై చూపించకూడదు. కాంట్రాక్ట్‌ పొందిన కంపెనీ పేరు కానీ, లోగో కానీ స్క్రీన్‌పై కనిపించకూడదు. కేవలం తమిళనాడు ప్రభుత్వ అధికారిక లోగో మాత్రమే ఉండాలి. మాట్లాడే సభ్యుని పేరు, వారి నియోజకవర్గం , చర్చించే అంశాన్ని తమిళం, ఆంగ్ల భాషల్లో క్యాప్షన్‌గా తెరపై ప్రదర్శించాలి. కాంట్రాక్టు తీసుకునే కంపెనీ ఉద్యోగులు ఎలాంటి రాజకీయ పార్టీలకు అధిపతులుగా లేదా ప్రతినిధులుగా ఉండకూడదు. అర్హత కలిగిన కంపెనీలు అధికారిక పోర్టల్‌ httpr://tntenderr.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. సభ సజావుగా సాగే పూర్తి, సవరించని అసలు రికార్డును మాత్రం ప్రభుత్వ రికార్డుల కోసం భద్రపరుస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement