● 15 వతేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ● జాలర్లకు అలర్ట్
సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బయలు దేరనున్నది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని చైన్నె వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయు వ్య దిశగా పయనిస్తూ నవంబర్ 14న తీవ్ర అల్పపీడనంగా, నవంబర్ 15 నాటికి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల వలన్ల గురువారం తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు తంజావూరు, తిరువారూరు, మైలాడుతురై, నాగపట్టణం, పుదుక్కోట్టై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న జిల్లాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్ష సూచన ఉంది. చైన్నె , శివారు ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి, కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో వేదారణ్యం, కులశేఖరపట్టణంలో గరిష్టంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడన తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులను తక్షణమే ఒడ్డుకు తిరిగి రావాలని మత్స్యశాఖ ఆదేశించింది. తూర్పు సముద్ర తీరంలో ఉన్న అన్ని రకాల పడవలు (నాటు పడవలతో సహా) గురువారం రాత్రిలోగా తీరానికి చేరుకుని సురక్షితంగా చేరుకుని లంగరు వేసుకోవాలని సూచించారు. ఇక, 13వ తేదీ నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లేందుకు మత్స్యకారులకు ఎటువంటి అనుమతులు (ఫిషింగ్ టోకెన్లు) జారీ చేయబోమని ప్రకటించారు.
అదుపుతప్పి బస్టాప్‌లోకి దూసుకెళ్లిన ట్యాంకర్
తిరువొత్తియూరు: మంగళవారం రాత్రి పాడి ఫ్లైఓవర్ నుండి విల్లివాక్కం వైపు ఒక నీటి ట్యాంకర్ లారీ వెళుతోంది. మయిలాడు తురైలోని ఎలందప్పూర్ ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్ లారీని నడుపుతున్నాడు. చైన్నె మెట్రో వాటర్ కాంట్రాక్ట్ కింద ఇతను లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విల్లివాక్కం సిట్కో నగర్ సిగ్నల్ వద్ద ఉన్న బస్టాప్ సమీపానికి రాగానే, లారీ ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి అదుపు తప్పింది. అదుపుతప్పిన ఆ లారీ సిగ్నల్ కోసం వేచి ఉన్న 3 మోటార్ సైకిళ్లను వరుసగా ఢీకొట్టి, పక్కనే ఉన్న బస్టాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్టాప్‌లో నిలబడి ఉన్న ఒక యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. అలాగే లారీ ఢీకొట్టడంతో బైక్‌లపై ఉన్న కొళత్తూరుకు చెందిన బాలా సహా 3 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మరణించిన యువకుడు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. బస్టాప్‌లో ఒకరిని బస్సు ఎక్కించడానికి వచ్చి వెళుతుండగా అతను నీటి లారీ కింద పడి మరణించినట్లు తెలిసింది. అతను హెల్మెట్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. దీనిని బట్టి అతను సమీపంలో ఎక్కడో తన బైక్ పార్క్ చేసి బస్టాప్‌కు వచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
యోగ నరసింహ స్వామికి నాగాభరణం
సాక్షి, చైన్నె : చైన్నెలోని ప్రసిద్ధ, చారిత్రాత్మక శ్రీ పార్థసారథి స్వామి ఆలయంలోని శ్రీ యోగ నరసింహ స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక సమర్పణ జరిగింది. పశ్చిమ ముఖంగా ఉన్న శ్రీ యోగ నరసింహ స్వామికి అలంకరించేందుకు 655 గ్రాముల బరువుగల అత్యంత సుందరమైన బంగారు నాగభరణాన్ని కానుకగా సమర్పించారు. సలానీ గ్రూప్ చైర్మన్, సలానీ జ్యువెలరీ మార్ట్ అధినేత జయంతిలాల్ సలానీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బంగారు నాగభరణాన్ని ఆలయ పరిపాలన విభాగానికి అధికారికంగా అందజేసి స్వామివారికి అంకితం చేశారు. స్వామివారికి ఈ దివ్యమైన ఆభరణాన్ని అలంకరించడం భక్తులలో తీవ్ర భక్తిభావాలను నింపింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ డాక్టర్ టి.జి. వినయ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.


