సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో సీఎం విజయ్ పాలన, సంక్షేమ పథకాల పంపిణీలో వేగం పెంచారు. ఈ నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ముందస్తు ఉప ఎన్నికల ప్రచారం తరహాలో ఈ అధికారి క కార్యక్రమాలు సాగబోతున్నాయి. రాష్ట్రంలో తిరు చ్చి తూర్పు, విరాళి మలై, కరూర్, అంబా సముద్రం, పెరుంతురై నియోజకవర్గాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో తిరుచ్చి తూర్పు సీఎం విజయ్ పోటీ చేసిన నియోజకవర్గం. మిగిలిని నాలుగు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ఖాళీ అయ్యాయి. ఇటీవల జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలలో విజయ ఢంకా మోగించిన టీవీకే తన ఎమ్మెల్యేల సంఖ్యను 109కి పెంచుకుంది. తాజాగా జరగబోతున్న ఐదు స్థానాలను కై వశంచేసుకుని సంఖ్యను 114కు పెంచుకునే దిశగా వ్యూహాలకు పదును పెట్టే పనిలో సీఎం విజయ్ ఉన్నారు.
సీఎం పర్యటన షెడ్యూల్
ఉప ఎన్నికలు జరగబోతున్న నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకుని నోటిఫికేషన్‌కు ముందుగా అధికారిక కార్యక్రమాల ద్వారా ప్రజా సంక్షేమ పథకాలను ఆ నియోజకవర్గాల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన పర్యటన షెడ్యూల్ వెలుగులోకి వచ్చి ఉంది. ఈ మేరకు నవంబర్ 2 (పుదుక్కోట్టై – విరాలిమలై నియోజకవర్గం)లో పర్యటించబోతున్నారు.సీఎం విజయ్ విమానంలో తిరుచ్చి చేరుకుని, అక్కడి నుంచి రోడ్ షో ద్వారా పుదుకోట్టై వెళ్లబోతున్నారు.విరాలిమలై నియోజకవర్గ పరిధిలో జరిగే పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, లబ్ధిదారులకు సంక్షేమ సహాయాన్ని అందిస్తారు.అలాగే, ఆ మరుసటి రోజు నవంబర్ 3వ తేదీన పెరుందరై నియోజకవర్గంలో పర్యటించనున్నారు.పెరుందరై నియోజకవర్గంలో నిర్వహించే బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 13 జిల్లాలకు చెందిన సుమారు 9,000 మహిళా స్వయం సహాయక బృందాలకు రూ. 1,110 కోట్ల బ్యాంకు రుణాలను సీఎం చేతుల మీదుగా అందించనున్నారు. వీటితో పాటు సుమారు 4,000 మంది లబ్ధిదారులకు ఇతర సంక్షేమ సహాయక పథకాలను పంపిణీ చేయనున్నారు. ఈ వేడుకల కోసం కొంగు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తదుపరి కాస్త విరామంతో నవంబర్ 14న అంబాసముద్రంలో బాలల దినోత్సవం వేడుకలకు హాజరు కానున్నారు. అంబాసముద్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సీఎం విజయ్ వేడుకలు జరుపుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ప్రతి ఏటా నిర్వహించే బాలల దినోత్సవాల్లో విద్యార్థులకు కేకులు పంచాలని నిర్ణయించామని, అందులో భాగంగా మొదటిగా విద్యార్థులకు స్వయంగా సీఎం కేక్ ముక్కలను పంపిణీ చేస్తారని అధికారులు వెల్లడించారు. కరూర్, తిరుచ్చిలలో ఇప్పటికే పర్యటించి ఉన్నప్పటికీ, ఎన్నికల నోటిఫికేషన్ కు ముందుగా ఈ నియోజకవర్గాలలో సైతం పర్యటించేందుకు విజయ్ షెడ్యూల్ సిద్ధం అవుతుండటం గమనార్హం.


