చైన్నెలో జీరో టాలరెన్స్‌ డే | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో జీరో టాలరెన్స్‌ డే

Nov 1 2026 4:43 AM | Updated on Nov 1 2026 4:43 AM

● ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘనలపై కొరడా ● తక్షణమే కేసు నమోదు ● నగర వ్యాప్తంగా తనిఖీల హోరు

సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో రహదారి భద్రతను పెంచేందుకు, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్‌ పోలీసు శాఖ తీవ్ర చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం చైన్నె మహానగర వ్యాప్తంగా జీరో టాలరెన్స్‌ డే (కఠిన చర్యల దినం) పాటించారు. దీంతో నగరంలోని అన్ని మార్గాలు, కూడళ్లలో ట్రాపిక్‌ పోలీసులు దూకుడుగా ముందుకు సాగారు. నిబంధనల్ని ఉల్లంఘించినవాహనదారులపై కొరడా ఝుళిపించి చలాన్ల మోత మోగించారు. చైన్నెలో సాధారణంగానే రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువే. ఇందులోనూ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారు కోకొల్లలు. వీరి భరతం నిత్యం పట్టే విధంగా పోలీసులు ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో కొన్ని ప్రత్యేక దినాలలో మరింత దూకుడుగా ముందుకెళ్లి జరిమానల వడ్డన మార్మోగిస్తుంటారు. ఆదిశగా శనివారం జీరో టాలెర్స్‌ డే పాటించడంతో ఉదయాన్నే చైన్నెలోని అన్నాసాలై, జీఎస్‌టీ రోడ్డు, పూందమల్లి హైరోడ్డు, కామరాజర్‌ సాలైవంటి ప్రధాన మార్గాలే కాదు, అనేక కూడళ్లలో ట్రాఫిక్‌ పోలీసులు తిష్ట వేశారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద పోలీసులు ఏకకాలంలో వాహన తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై ఎలాంటి మినహాయింపు లేకుండా తక్షణమే కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ద్విచక్ర వాహనదారులులలో బైక్‌ నడిపే వారితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి (పిలియన్‌ రైడర్‌) కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సి ఉండటం, ఈ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడ్డ వారు మరీ ఎక్కువే. నాలుగు చక్రాల వాహనాల్లోని డ్రైవర్‌ , ప్రయాణికులు తప్పనిసరిగా సీట్‌ బెల్ట్‌ ధరించారా? అని ఆరా తీశారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఉల్లంఘించడం , అజాగ్రత్తగా, అధిక వేగంతో వాహనాలు నడిపిన వారితో కాస్త కఠినంగానే వ్యవహరించారు. వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వారికి అయితే ప్రత్యేకంగా క్లాస్‌ తీసుకున్నారు. ఈ జీరో టాలరెన్స్‌ డే గురించి ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొంటూ, ప్రతి మానవ జీవితం చాలా అమూల్యమైనదన్నారు. రోడ్డు ప్రమాదాలు లేని సురక్షిత ప్రయాణాన్ని అందించడమే తమ ప్రధాన ధ్యేయం అని, అందుకే పకడ్భందీ చర్యలతో ఈ జీరో టాలరెన్స్‌ డే సందర్భంగా వాహనదారులందరూ ట్రాఫిక్‌ నిబంధనలను ఖచ్చితంగా పాటించి రీతిలో చర్యలు తీసుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement