సాక్షి , చైన్నె: కాలేయ ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరించడం , జీవనశైలి మార్పులపై ప్రజలలో చైతన్యం తీసుకు రావడమే లక్ష్యంగా చైన్నెలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రి, వడ చైన్నె సైక్లిస్టులతో కలిసి పెడల్ ఫర్ లివర్ పేరుతో కమ్యూనిటీ సైక్లోథాన్‌ను శనివారం చైన్నెలో నిర్వహించారు. ఆసుపత్రి వార్షిక కాలేయ అవగాహన ప్రచారంలో భాగంగా ఉదయం ఈ సైకిల్ ర్యాలీలో 150 మందికి పైగా సైక్లింగ్ ఔత్సాహికులు, వైద్యులు , పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నానగర్ నియోజకవర్గ శాసనసభ్యులు వి.కె. రామ్‌కుమార్ ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం హెల్త్‌కేర్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ లివర్ డిసీజెస్, ట్రాన్స్‌ప్లాంట్ – హెచ్‌పిబి సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ అండ్ డైరెక్టర్ డాక్టర్ త్యాగరాజన్ శ్రీనివాసన్, ఆసుపత్రి సీఈఓ శ్రీ పద్మనాభన్, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీ రాజేష్ అగర్వాలా పాల్గొన్నారు. ఈసందర్భంగా వైద్యులు పేర్కొంటూ, కొవ్వు కాలేయ వ్యాధిని ప్రస్తుతం మెటబాలిక్ డిస్ఫంక్షన్–అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్ డిసీజ్ అని పిలుస్తున్నారన్నారు. ఊబకాయం, మధుమేహం (షుగర్), అధిక కొలెస్ట్రాల్ , శారీరక శ్రమ లేని నిశ్చల జీవనశైలి దీనికి ప్రధాన కారణాలని వైద్యులు హెచ్చరించారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉన్నందున.. ఫైబ్రోస్కాన్ వంటి నాన్–ఇన్వాసివ్ పరీక్షల ద్వారా కాలేయ దృ ఢత్వాన్ని, కొవ్వు శాతాన్ని ముందుగానే అంచనా వేయవచ్చని తెలిపారు.


