కొరుక్కుపేట: సదరన్ రైల్వే చైన్నె డివిజన్ 16 సబ్‌వేలను ప్రారంభించింది. మరో 3 ప్రదేశాలలో పనులు కొనసాగుతున్నాయి. వివరాలు.. రైలు, రహదారి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి, కార్యాచరణ భద్రతను మెరుగుపరచడానికి, లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద ప్రమాదాలను నివారించడానికి, దక్షిణ రైల్వే చైన్నె డివిజన్ తన నెట్‌వర్క్ అంతటా కీలక మౌలిక సదుపాయాల నవీకరణలను క్రమపద్ధతిలో ముందుకు తీసుకువెళుతోంది. ఈ సమగ్ర భద్రతా కార్యక్రమంలో భాగంగా, సిబ్బందితో కూడిన లెవెల్ క్రాసింగ్ (ఎల్ సీ) గేట్లను క్రమంగా లిమిటెడ్ యూసేజ్ సబ్‌వేలు (ఎల్‌యూఎస్), రోడ్ అండర్ బ్రిడ్జ్‌లతో (ఆర్ యూ బి) భర్తీ చేస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో.. ఈ విభాగం 11 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద సబ్‌వేలు, అండర్‌పాస్‌లను విజయవంతంగా పూర్తి చేసి, ప్రారంభించింది. ఇదే ఊపును కొనసాగిస్తూ, ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో (సెప్టెంబర్ 2026 వరకు), అదనంగా 5 లెవెల్ క్రాసింగ్‌లను తొలగించి, వాటి స్థానంలో సబ్‌వేలను నిర్మించడం జరిగింది. దీంతో, ప్రారంభించబడిన సబ్‌వేల మొత్తం సంఖ్య 16కు చేరింది. ఒక్కో సబ్‌వే నిర్మాణానికి సుమారు రూ. 8 కోట్ల అంచనా వ్యయం అయింది. చైన్నె డివిజన్ వ్యాప్తంగా ప్రారంభించబడిన 16 సబ్‌వేలు , నిర్మాణంలో ఉన్న 3 సబ్‌వే ప్రాజెక్టుల వివరాలను సదరన్ రైల్వే వెల్లడించింది.


