కొరుక్కుపేట: ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని దక్షిణ రైల్వే చైన్నె డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శైలేంద్ర సింగ్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ డి.మోహన ప్రియ తెలిపారు. వారు శుక్రవారం చైన్నె బీచ్ రైల్వే స్టేషన్‌లో మద్రాస్ కాఫీ హౌస్ ప్రీమియం బ్రాండ్ క్యాటరింగ్ అవుట్‌లెట్ (పీబీసీవో)ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రోజు వారీ ప్రయాణికులు, సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఆధునిక, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే ఒక సుప్రసిద్ధ దక్షిణ భారత బ్రాండ్‌ను స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. ఈ అవుట్‌లెట్‌లో కఠినమైన ఆహార నియమాలు, నాణ్యత ప్రమాణాల ప్రకారం తయారు చేసిన అనేక రకాల వేడి పానీయాలు, సాంప్రదాయ దక్షిణ భారత రిఫ్రెష్‌మెంట్‌లు, స్నాక్స్, తినడానికి సిద్ధంగా ఉండే వస్తువులు లభిస్తాయని తెలిపారు.


