తిరువొత్తియూరు: నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చైన్నె, తిరువాన్మియూరులో కళా ఉత్సవం పేరిట చేనేత, హస్తకళా ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. కళాక్షేత్ర రోడ్డులో ఉన్న సీఈ ఆర్సీ క్యాంపస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ దీనికి వేదికగా మారింది. ఇందులో క్రాఫ్ట్స్, టెక్స్‌టైల్స్‌తో పాటు హోమ్ డెకార్, జ్యువెలరీ, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన చీరలు.. భాగల్పూరి, చందేరి, బెంగాల్ కాటన్, కంచి కాటన్, హుబ్లీ కాటన్, చెట్టినాడు కాటన్, లడక్ సిల్క్, కాశ్మీరీ సిల్క్, పోచంపల్లి చీరలు ఉన్నాయి. అలాగే కాటన్ టాప్స్, హ్యాండ్ వర్క్ టాప్స్, సల్వార్ సూట్లు ప్రదర్శనకు ఉంచారు. నవరాత్రి ఉత్సవాల కోసం కొలువు బొమ్మలు, గృహాలంకరణ కోసం ఎర్రకోట వస్తువులు, ఉడెన్ క్రాఫ్ట్ ఐటమ్స్, సిరామిక్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, కర్టన్ ఐటమ్స్, బెడ్ షీట్లు, సోఫా సెట్ కవర్లు, ఫర్నిచర్ ఐటమ్స్, కిడ్స్ వేర్, కిడ్స్ ప్లే ఐటమ్స్, జ్యువెలరీ రకాలు, ఇత్తడి కళారూపాలు ఉన్నాయి. ఈ ప్రదర్శన ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని, ఎంట్రీ, పార్కింగ్ ఉచితమని నిర్వాహకులు తెలిపారు. అక్టోబరు 4వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.


