క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

బైక్‌తో ఢీకొట్టి

రూ.24 లక్షల దోపిడీ

అన్నానగర్‌: అడయార్‌లో గురువారం రాత్రి ఆరుగురు ముఠా బైకుపై వచ్చి మందుల దుకాణం మేనేజర్‌ను ఢీకొట్టి కత్తితో బెదిరించి రూ.24 లక్షలను దోపిడీ చేసింది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చైన్నెలోని వెస్ట్‌ తాంబరం, కన్నడపాలయం, వసంతం నగర్‌లో నివసిస్తున్న ఆంథోని అగస్టిన్‌ (33) ఐడీబీఎల్‌ నగర్‌లో ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజులకు ఒకసారి కంపెనీ డబ్బును వసూలు చేసి ఇంటికి తిరిగి వస్తాడు. మరుసటి రోజు కంపెనీ అధికారులకు తెలియజేసి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. గురువారం రాత్రి అతను చైన్నెలోని కంపెనీకి పంపిణీ చేసిన మందుల కోసం రూ.24,00,760 బ్యాగ్‌లో ఉంచుకుని బైకు ముందు భాగంలో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. అడయార్‌ ప్రాంతంలో 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల ఆరుగురు 3 బైకులపై వచ్చి ఆంథోని అగస్టిన్‌ను ఢీకొట్టారు. కింద పడిన అతడిని కత్తితో బెదిరించి డబ్బు లాక్కుని పారిపోయారు. ఆంథోని అగస్టిన్‌ అడయార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా ముఠా కోసం గాలిస్తున్నారు.

నాణ్యమైన ఆహారం

అందించాలి

కొరుక్కుపేట : ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార కార్యక్రమాన్ని ఇప్పుడు 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు కూడా విస్తరించారు. దీంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో వంట నాణ్యత, పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడకూడదని పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అల్పాహారం అందించడానికి ముందు పాటించాల్సిన నియమాలను వివరించింది

వంటగదిలో వంట పాత్రలు కాకుండా ఇతర వస్తువులను ఉంచడం పూర్తిగా మానుకోవాలని పేర్కొంది. వంటగదిని ఎల్లప్పుడూ పొగ, దుమ్ము, నూలు పోగులు లేకుండా శుభ్రంగా ఉంచాలని, వంట పాత్రలు, వడ్డించే పాత్రలను వాడకానికి ముందు, తర్వాత క్షుణ్ణంగా శుభ్రం చేయాలని సూచించింది. విద్యార్థులకు వండిన ఆహారాన్ని వడ్డించే ముందు, ఆ ఆహారం ఆరోగ్యకరమైనదో కాదో పరీక్షించాలని, ఉపాధ్యా యులు ఆహారాన్ని రుచి చూసి, అది సరైన నాణ్యతతో ఉందని నిర్ధారించుకున్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని పేర్కొంది. వండిన తర్వాత తీసివేసిన పాత్రలలో వడ్డించే ఆహార పదార్థాలను, విద్యార్థులకు పూర్తిగా అవసరమైనప్పుడు మాత్రమే తెరిచి వడ్డించాలని, వంట చేసేటప్పుడు, ఆహారాన్ని ఇతర వడ్డించే పాత్రలలోకి మార్చిన తర్వాత ఉపాధ్యాయులు ఆహారాన్ని మూసి ఉంచేలా చూసుకోవాలని ఆదేశించింది. పాఠశాల ప్రిన్సిపాల్‌ ప్రతిరోజూ వంతులవారీగా విద్యార్థులకు ఆహారం వడ్డించడాన్ని పర్యవేక్షించాలని పేర్కొంది.

లైంగిక దాడి కేసులో

యువకుడికి జైలు శిక్ష

తిరువళ్లూరు: కాలకృత్యాలు తీర్చుకోవడాని కి వెళ్లిన మహిళ(54)పై లైంగిక దాడి చేసిన యువకుడు (24)కి రెండు జీవిత కారాగార శిక్షలతోపాటు రూ.1.25 లక్షల జరిమానా విధిస్తూ తిరువళ్లూరు కోర్టు తీర్పు చెప్పింది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలూకా పాలవాక్కం గ్రామానికి చెందిన పూంగొడి(54) 2025లో సెన్నాంగాకరనై గ్రామంలోని కుమార్తె ఇంటికి వెళ్లింది. అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని ప్రాంతానికి వెళ్లింది. అక్కడ వున్న గుర్తు తెలియని వ్యక్తి ఆమైపె లైంగిక దాడి చేశాడు. విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు తన కుమార్తెకు చెప్పడంతో వారు ఊత్తుకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే గ్రామానికి చెందిన రాజ(24)ను అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా కోర్టులో కేసు విచారణ జరిగింది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి జూలియట్‌ పుష్ప తీర్పును వెలువరించారు. నిందితుడికి రెండు జీవిత కారాగార శిక్షలతోపాటు రూ.1.25 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని క్రమంలో మరో ఆరు నెలలు అదనంగా శిక్ష అనుభవించాలని ఆదేశించారు.

విద్యుత్‌ కోతలను

నిరసిస్తూ ధర్నా

తిరువొత్తియూరు: చైన్నె మణలి విద్యుత్‌ సబ్‌–స్టేషన్‌ పరిధిలోని జె.జె.నగర్‌, ఎం.జి.ఆర్‌. నగర్‌, వరదరాజన్‌ వీధి తదితర ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్‌ నిలిచిపోయింది. చాలా సమయం గడిచినా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించకపోవడంతో ఆగ్రహం చెందిన స్థానిక ప్రజలు మణలి విద్యుత్‌ శాఖ కార్యాలయం ఎదుట కామరాజర్‌ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ నిరసన కార్యక్రమం వల్ల ఆ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న మణలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. విద్యుత్‌ శాఖ కార్యాలయానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, విద్యుత్‌ సరఫరా ఇస్తేనే నిరసనను విరమిస్తామని వారు భీష్మించారు. సుమారు 3 గంటల నిరసన తర్వాత ఆ ప్రాంతానికి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో ప్రజలు నిరసనను విరమించి అక్కడి నుంచి వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement