విజయ్, పళణి ఓట్ల వేట
సాక్షి, చైన్నె: మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది. తుది జాబితా వెలువడటంతో అభ్యర్థులు, వారి మద్దతు దారులు ఓటర్ల ఇళ్ల వద్దకే వె ళ్లి ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలలో మధురాంతకంలో 27 మంది, ధారాపురంలో 22 మంది అభ్యర్థులు తుది బరిలో నిలిచారు. వీరిలో మధురాంతకం నుంచి మరగదం కుమారవేల్ (టీవీకే), పరంధామన్ (డీఎంకే), కనిత సంపత్ (అన్నాడీఎంకే), సుగంది(సీపీఎం ), జానకి రామన్(ఎన్‌టీకే) తరపున పోటీలో ఉన్నారు. ఇక ధారాపురంలో సత్యభామ (టీవీకే), సుకన్య (డీఎంకే), భానుమతి (అన్నాడీఎంకే), కార్తీక (ఎన్‌టీకే), లక్ష్మణన్(సీపీఐ) తరపున పోటీ చేస్తున్నారు. నామినేషన్ల ఉపంసహరణ ప్రక్రియ ముగించి, తుది జాబితా వెలువడడడంతో ఆదివారం నుంచి ప్రచారంలో అభ్యర్థులు ముమ్మరంగా దృష్టి పెట్టారు. అక్టోబరు 6వ తేది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రానున్న రెండు వారాల పాటుగా ఓటర్లను వీలైనంత మేరకు వినూత్న రీతులలో ఆకర్షించే పనిలో పడ్డారు. డీఎంకే అభ్యర్థి పరందామన్ అయితే, మధురాంతకంలో సూట్ కేసుతో పాటుగా ప్రచారంలో దూస్తుకెళ్తున్నారు. ఇక్కడ పదవికి రాజీనామాచేసి తాజాగా టీవీకే తరపున పోటీ చేస్తున్న మరగదం కుమర వేల్ అధికార పక్షం నుంచి నోట్లకు అమ్ముడు పోయారంటూ తీవ్ర ఆరోఫణలు చేస్తూ ఓటర్లకు సూట్ కేసును చూపిస్తూ వస్తున్నారు. ఇక, ధారాపురంలో టీవీకే అభ్యర్థి సత్యభామాకు అనేక చోట్ల చుక్కెదురు అవుతున్నది. పదవికి ఎందుకు రాజీనామా చేశారంటూ ప్రజలు ఆమెను నిలదీయడంతో ఇరకాటంలో పడుతుండటం గమనార్హం. మధురాంతకం అన్నాడీఎంకే అభ్యర్థి కనిత సంపత్ ఇక్కడి 40 గ్రామాలను ఎంపిక చేసుకుని, రోజుకు రెండు మూడ గ్రామాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సీపీఎం అభ్యర్థి సుగంది అయితే, గ్రామీణ మహిళలు, ఉపాధి హామీ పథకం మిహిళలతో సమావేశం అవుతూ ఆదరించాలని విన్నవిస్తూవ వస్తున్నారు.
టీవీకే వ్యూహాత్మకంగా అడుగులు..
ఈ ఉప ఎన్నిక తమకు ప్రతిష్టాత్మకం కావడంతో టీవీకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఆ పార్టీ కీలక నేతలు ఆనంద్, ఆదవ్ అర్జునలు ఉప ఎన్నికల వ్యూహాలు, సమన్వయంపై పార్టీ వర్గాలతో పాటుగా కూటమి మిత్ర పక్షాల స్థానిక నేతలను ఆహ్వానించి సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. అదే సమయంలో 40 మంది స్టార్ ప్రచార ప్రతినిధులను టీవీకే రంగంలోకి దించింది. ఇందులో తమ పార్టీ నేతలతో పాటు కూటమి పార్టీలైన కాంగ్రెస్ (మాణిక్యం ఠాకూర్), వీసీకే (తిరుమావళవన్), ఎండీఎంకే (వైగో, దురై వైకో), ఐయూఎంఎల్(ఖాదర్ మొహిద్దీన్)ల పేర్లు కూడా చేశారు. అయితే, ఇతర పార్టీల నాయకులను టీవీకే స్టార్ ప్రచార ప్రతినిధుల జాబితాలో చేర్చడం విమర్శలకు దారి తీసింది. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 77 నిబంధనల చట్ట ప్రకారం ఒక రాజకీయ పార్టీ తమ స్వంత పార్టీకి చెందిన నేతలను మాత్రమే తమ స్టార్ స్పీకర్లుగా జాబితాలో చేర్చాలి. అయితే,ఒక పార్టీకి చెందిన స్టార్ స్పీకర్ ప్రచారం చేస్తే ఆ ఖర్చు పార్టీ ఖాతాలోకి వెళ్తుంది. అలా కాకుండా ఇతర పార్టీల నేతలు వచ్చి ప్రచారం చేస్తే ఆ ప్రచార ఖర్చు పూర్తిగా సంబంధిత అభ్యర్థి వ్యక్తిగత ఎన్నికల ఖర్చు పరిమితి కిందకే వస్తుందన్న, వేరే పార్టీలలో కీలక బాధ్యతల్లో ఉన్న నాయకులను తమ పార్టీ ప్రచారకులుగా పేర్కొనడం ప్రాథమిక ఎన్నికల నియమావళిపై అవగాహన రాహిత్యాన్ని సూచిస్తుందని ప్రతి పక్షాలు, రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా ఈనెల 25వ తేదిన సీఎం విజయ్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి లు మధురాంతకంలో ప్రచారం నిర్వహించనున్నారు.
ప్రభుత్వ సెలవు ప్రకటన..
పోలింగ్ రోజైన అక్టోబర్ 6న మధురాంతకం, ధారాపురం నియోజకవర్గాల్లో స్థానిక ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఈ ప్రాంత ఓటర్లయిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన తప్పనిసరి సెలవు ఇవ్వాలని సీఎస్ ఎం. సాయి కుమార్ ఆదేశించారు.


