చైన్నె విమానాశ్రయం ప్రైవేటీకరణ..? | - | Sakshi
Sakshi News home page

చైన్నె విమానాశ్రయం ప్రైవేటీకరణ..?

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

● సీఎం మోదీకి ● గుర్రు మంటున్న వామపక్షాలు

సీఎం విజయ్‌ లేఖ కలకలం

సాక్షి, చైన్నె: కేంద్ర ప్రభుత్వ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న ప్రధాన మెట్రోపాలిటన్‌ విమానాశ్రయంగా చైన్నె కూడా ఉన్న విషయం తెలిసిందే. కాగా దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాలు ఇప్పటికే అదానీ గ్రూప్‌ వంటి ప్రైవేట్‌ బహుళజాతి సంస్థల నియంత్రణలోకి వెళ్లాయి. ఈ తరుణంలో చైన్నె విమానాశ్రయ నిర్వహణలో మార్పు కోరుతూ తమిళనాడు సీఎం విజయ్‌... ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రహస్యంగా లేఖ రాసినట్టుగా వెలువడ్డ సమాచారం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది.

వివాదానికి అసలు కారణం:

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. అయితే ఇందుకు విరుద్ధంగా, తమిళనాడు ప్రభుత్వమే స్వయంగా విమానాశ్రయ నిర్వహణ మార్పునకు లేఖ రాయడంపై సామాజిక కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా మార్పు ముసుగులో అదానీ లేదా జీఎంఆర్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలకు చైన్నె విమానాశ్రయాన్ని పూర్తిగా కట్టబెట్టేందుకే ఈ ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు బయలుదేరాయి.

పరందూరు ప్రాజెక్ట్‌ రద్దు – కొత్త సందేహాలు:

కాంచీపురం జిల్లా పరందూరులో గతంలో ప్రకటించిన వేల కోట్ల విలువైన కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ ప్రాజెక్టును టీవీకే ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఒకవైపు కొత్త ప్రాజెక్టును రద్దు చేస్తూ, మరోవైపు ఉన్న విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించాలని కోరుతూ రహస్య లేఖ రాయడం సర్వత్రా చర్చకు దారి తీసినట్టైంది.

కూటమి పార్టీల అసంతృప్తి

ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించే కూటమిలోని వామపక్షాలు, ఇతర పార్టీలు ప్రభుత్వ ఈ వైఖరిపై తీవ్ర దిగ్భ్రాంతిని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా మద్దతు ఇస్తున్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, ప్రభుత్వం దీనిపై తగిన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ మహిళా నేత వానతీ శ్రీనివాసన్‌ స్పందిస్తూ, సీఎం విజయ్‌ ప్రధాన మంత్రి మోదీకి రాసిన లేఖఫై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రైవేటీకరణ వ్యవహారం అనుమానాలకు దారి తీస్తున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement