కస్తూరి వీడు చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై యూనిట్ సభ్యులు
తమిళసినిమా: నటుడు సముద్రఖని, యోగిబాబు, నటి తనూజ, తంబి రామయ్య, డేవిడ్ డిట్టో, శ్రీ వర్షత్ ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం కస్తూరి వీడు. దీనికి విజయ్ ఆర్.ఆనంద్ కథ, దర్శకత్వం బాధ్యతలను చేపట్టారు. ఈ చిత్రం ద్వారా రాణి శ్రీరెడ్డి, లయన్ డాక్టర్ వాగేష్ అనే వ్యాపారవేత్తలు నిర్మాతలుగా పరిచయమయ్యారు. వీరు రన్ డాక్ ఫిలిమ్స్, లయన్ వీ ఫిలిమ్స్, అన్నై సినిమాస్ సంస్థలపై నిర్మిస్తున్న చిత్రం ఇది. సైంటిఫిక్, హారర్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి కార్తీక్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం చైన్నెలోని కమలా సినీ కాంప్లెక్స్‌లో నిర్వహించారు. తమిళ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు జీకేఎం.తమిళ్ కుమరన్, దర్శకుడు పేరరసు, పవిత్రన్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ తాము వేరే వ్యాపార రంగాల నుంచి వచ్చి నిర్మించిన తొలి చిత్రం ఇదని చెప్పారు. దర్శకుడు అరగంటలో చెప్పిన కథ నచ్చడంతో వెంటనే చిత్రం చేయడానికి సిద్ధమైనట్టు చెప్పారు. దర్శకుడు కఠిన శ్రమజీవి అని, కస్తూరి వీడు చిత్రం చాలా బాగా వచ్చిందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు విజయ్ ఆర్.ఆనంద్ మాట్లాడుతూ మొదట రూ.50 వేలతో ప్రారంభించిన ఈ చిత్రంలో నటుడు సముద్రఖని వచ్చిన తరువాత చాలా పెద్దగా మారిపోయిందన్నారు. ఆయనతో ఎలా నటింపజేయాలనే భయం కలిగిందనీ, ఆయన ఆ భయాన్ని పోగొట్టి ఎంతగానో సహకరించారని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జీకేఎం.తమిళ్ కుమరన్ మాట్లాడుతూ సినిమా అనేది కలల ప్రపంచమన్నారు. ఎన్నో కలలతో వచ్చే నిర్మాతలు చిత్రాలను నిర్మిస్తారనీ, అలా వచ్చిన వారే ఈ చిత్ర నిర్మాతలు అని అన్నారు. చిత్ర నిర్మాణం అంత సులభం కాదన్నారు. కొందరు నిర్మాతలు పరిస్థితి చూస్తే పాపం అనిపిస్తుందన్నారు. సినిమా మంచి వృత్తి అనీ, దాన్ని సరిగా చేస్తే విజయం లభిస్తుందని, అందుకు చిన్న ఉదాహరణ ఇటీవల విడుదలైన మండాడి చిత్రం అని పేర్కొన్నారు.


