వేలాదిగా కొలువైన గణనాథులు మార్కెట్లకు పోటెత్తిన జనం పూజా సామాగ్రి ధరలకు రెక్కలు నిఘా కట్టుదిట్టం
గరిక
విక్రయానికి సిద్ధం చేసిన వివిధ రకాల గణపయ్యలు
గొడుగులు
రాష్ట్రంలో వినాయక చవితి సందడి ఆదివారం నుంచే మొదలైంది. ఇళ్లల్లోనూ, వీధుల్లోనూ మండపాలను ఏర్పటు చేసి సోమవారం గణపయ్య విగ్రహాలు కొలువు దీర్చి భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు. పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని మార్కెట్లలో వ్యాపారం జోరుగా జరిగింది. పూజా సామాగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గణపయ్య విగ్రహాలను కొలువు దీర్చే ప్రాంతాలలో నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలను ఆయా పరిధిలోని పోలీసు స్టేషన్ల అధికారులు తెలియజేస్తున్నారు.
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈసారి వినాయక చవితికి శని, ఆదివారాలు కలిసి రావడంతో మూడు రోజులు సెలవు దక్కినట్లయ్యింది. దీంతో సోమవారం ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో చవితిని జరుపుకునేందుకు ఇప్పటికే జనం తమ స్వస్థలాలకు చేరుకున్నారు. పండుగ, నేపథ్యంలో రవాణా సంస్థతో పాటుగా ప్రైవేటు ట్రావెల్స్‌లు ప్రత్యేక బస్సులపై దృష్టి పెట్టాయి. ప్రైవేటు బస్సులు చార్జీల దోపిడీకి హద్దే లేని పరిస్థితి నెలకొంది. స్వస్థలాలకు వెళ్లిన వారు, ఆయా నగర, పట్టణ, గ్రామాలలోని ప్రజలందరు పండగను ఆనందోత్సాహాలో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ దిశగా ఒక రోజు ముందుగానే ఉదయం నుంచి వాడ వాడల్లో పండుగ సందడి నెలకొంది. రాష్ట్రంలోని చిన్నా, పెద్దా మార్కెట్లు కొనుగోలుదారులతో కిట కిటలాడాయి. జన సంచారం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో, రోడ్ల వెంబడి దుకాణాలు వెలిశాయి. చైన్నెలో కొశ పేట, పొన్నేరి, కొళత్తూరు, ఆవడి, ముడిచ్చూరు, రెడ్ హిల్స్, తాంబరం పరిసరాల నుంచి తయారు చేసిన విగ్రహాలన్నీ మార్కెట్లోకి వచ్చాయి. ఇక బంకమన్నుతో సిద్ధం చేసిన, రంగు రంగులతో ముస్తాబైన వినాయకుడి ప్రతిమల్ని, పూజా వస్తువుల్ని కొనుగోలు చేయడానికి జనం మార్కెట్ల వైపుగా తరలి వచ్చారు. దీంతో వినాయకుడి విగ్రహాలకు, బొమ్మల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక పూజా కై ంకర్య వస్తువుల ధరలు అదే బాటలో సాగాయి. ధరలు ఆకాశాన్ని అంటినా తమ స్తోమతకు తగ్గట్టుగా సామాగ్రిని కొనుగోలు చేసి భక్తిని చాటుకునే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. ఉండ్రాలు, గుగ్గిల్లు తయారు చేసి బొజ్జగణపయ్యకు నైవేథ్యంగా సమర్పించేందుకు సిద్ధమయ్యారు.
ఆలయాల్లో ఉత్సవాలు..
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో , గ్రామ గ్రామాన కొలువు దీరి ఉన్న వినాయకుడి ఆలయాలు ప్రత్యేక పూజలకు సిద్ధం అయ్యాయి. భక్తుల దర్శనార్థం ఆయా ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లుచేసి ఉన్నారు. వేకువజాము నుంచి ఆలయాల్లో విశిష్ట పూజాధి కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో జరగనున్నాయి. తిరుచ్చిలో ప్రసిద్ధి చెందిన ఉచ్చి పిళ్లయార్ ఆలయం, కారైకుడి పిళ్లయార్ పట్టిలోని కర్పగ వినాయగర్ ఆలయం, తిరువారూర్ జిల్లా పూనతోట్టంలోని ఆది వినాయగర్, మదురైలోని ముక్కుర్ని వినాయగర్, తిరువయ్యారు, చిదంబరం, తంజావూరు, కోయంబత్తూరు, కుంబకోణంలోని అతిపెద్ద గణపయ్య ఆలయాల్లో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుచ్చి ఉచ్చి పిళ్లయార్ ఆలయంలో చవితి ఉత్సవాలు కోలాహలంగా జరగనున్నాయి. పిళ్లయార్ పట్టి, ఉచ్చి పిళ్లయార్ ఆలయాలలో అయితే, బ్రహ్మాత్సవాలు జరుగుతున్నాయి.
వాడవాడలా
వినాయకుల కొలువు
హిందూ మక్కల్ కట్చి, హిందూ మున్నని, శివ సేన, బీజేపీ నేతృత్వంలో రాష్ట్రంలో వాడవాడల్లో వేలాది విగ్రహాలు పూజలకు కొలువు దీరనున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఐదు నుంచి పది అడుగుల లోపు విగ్రహాలను కొలువు దీర్చనున్నారు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బ తినకుండా, ట్రాఫిక్‌కు ఆటంకాలు కలిగించకుండా ఉండే రీతిలో విగ్రహాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అలాగే విగ్రహాల కోసం ఏర్పాటు చేసిన స్టేజీలు, పందిళ్లు, అలంకరణలు అగ్ని, ఇతర ప్రమాదాలకు ఆస్కారం లేని రీతిలో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. లక్షకు పైగా విగ్రహాలు కొలువు దీరనున్నడంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా జరుపుకునే విధంగా భద్రతా పరంగా పోలీసులు సిద్ధమయ్యారు. సిబ్బంది అందరూ తప్పని సరిగా విధుల్లో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసే చోట్ల నిర్వాహకుల సహకారంతో భద్రతా కమిటీలు ఏర్పాటు చేశారు. చైన్నెలో వేల మందితో భద్రతా చర్యలు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ‘చవితి’ సందడి
నేతల శుభాకాంక్షలు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అర్లేకర్, మాజీ సీఎం పళని స్వామి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కో – ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, టీఎన్‌సీసీ నేత మాణిక్యం ఠాకూర్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జికే వాసన్, వి ది లీడర్స్ నేత అన్నామలై తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనందోత్సాహంతో, భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆటంకాలు తొలగి సకల శుభాలు, విజయాలు వరించాలని వేడుకున్నారు.


