క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Sep 14 2026 3:32 AM | Updated on Sep 14 2026 3:32 AM

తిరుత్తణిలో చతుర్ధి సందడి

తిరుత్తణి: చతుర్ధి సందర్భంగా పూజా సామాగ్రి కొనుగోలుకు తిరుత్తణి మార్కెట్‌లో ఆదివారం జనం పోటెత్తారు. దీంతో మార్కెట్‌ కిక్కిరిసింది. దేశ వ్యాప్తంగా సోమవారం వినాయక చతుర్ధి పర్వదినం సందర్భంగా గణనాధుడికి పూజలు చేసి మొక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. చతుర్ధి పూజలకు పూజా సామాగ్రి, బంకమట్టి వినాయకుడి ప్రతిమలు కొనుగోలు కోసం తిరుత్తణి మపోసి రోడ్డు మార్గంలోని కామరాజర్‌ మార్కెట్‌తో పాటు ప్రదాన రోడ్లు, చిత్తూరు రోడ్డు మార్గాల్లో దుకాణాలకు ప్రజలు పోటెత్తారు. కాగా పూజా సామాగ్రి ధరలు భారీగా పెరగడంతో కొనుగోలు దారులు ఇబ్బంది పడ్డారు.

ప్రయాణికులకు

తగిన భద్రత కల్పించాలి

తిరుత్తణి: తిరుత్తణి కొత్త బస్టాండులో ప్రయాణికులకు భద్రత కల్పించే విధంగా పోలీసులు బందోబస్తు నిర్వహించాలని ప్రయాణికులు కోరా రు. తిరుత్తణిలో ట్రాఫిక్‌ సమస్య బస్సులు రాకపోకలకు మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా స్థానిక అరక్కోణం రోడ్డు మార్గంలో రూ. 22 కోట్ల వ్యయంతో గత డీఎంకే ప్రభుత్వంలో నూతన బస్టాండు నిర్మించి మార్చి నెలలో కొత్త బస్టాండు సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తు తం కొత్త బస్టాండు నుంచి వివిధ ప్రాంతాలకు 200కు పైగా బస్సులు రాకపోకలు సాగిస్తున్నా యి, ఆ బస్సుల్లో వేలాది మంది రోజూ ప్రయాణం చేస్తున్నారు. బస్టాండులో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కోసం పోలీసులకు ప్రత్యేక గది అవుట్‌ పోలీస్‌ స్టేషన్‌కు గది వుంది. అయితే కొత్త బస్టాండులో అవుట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇంత వరకు తెరుచుకోక పోవడంతో పోలీసులు సైతం భద్రత పనులు చేపట్టడం లేదు. దీంతో యువత ఆగడాలతో పాటు కళాశాల విద్యార్థినులు, మహిళల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. కాగా బస్టాండులో ప్రయాణికులు భద్రత కల్పించే విధంగా అవుట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని ప్రయాణికులు జిల్లా ఎస్పీ సాయి ప్రణీత్‌ను కోరారు.

ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్‌లో..

– దివ్యాంగ ప్రయాణికులకు

ప్రత్యేక సౌకర్యాలు

అన్నానగర్‌: చైన్నె ఎగ్మోర్‌ రైల్వే స్టేషనన్‌లో జరుగుతున్న పునరుద్ధరణ పనుల కారణంగా ప్రయాణికులు వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ఉత్తర ద్వారం నుంచి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పూందమల్లి రోడు నుండి ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్‌ వరకు దివ్యాంగులు ప్రయాణించడానికి ఎలాంటి సౌకర్యాలు లేవని ఒక దివ్యాంగుడు ఫిర్యాదు చేశాడు. ఉత్తర భాగంలో లిఫ్ట్‌, ఎస్కలేటర్‌ వంటి సౌకర్యాలు లేకపోవడంతో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రాథమికంగా, దివ్యాంగులైన ప్రయాణికులను గాంధీ ఇర్విన్‌ రోడ్‌ ప్రవేశ ద్వారం గుండా వెళ్లమని సూచించారు. ఆ ప్రవేశ ద్వారం నుంచే దివ్యాంగులను ప్లాట్‌ఫారమ్‌ల వద్దకు నడిపిస్తారు. ఇర్విన్‌ రోడ్‌ ద్వారా 1 నుండి 4 ప్లాట్‌ఫారాలకు నేరుగా నేలమట్టంలో ప్రవేశం కల్పించబడింది.5, 6, 7 ప్లాట్‌ఫారాలకు చేరుకోవడానికి రెండు చివర్లలో ట్రాలీ మార్గాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గాంధీ ఇర్విన్‌ రోడ్‌ నుండి వచ్చే దివ్యాంగులు 8 నుండి 11 ప్లాట్‌ఫారాలకు చేరుకోవడానికి ఫుట్‌బ్రిడ్జ్‌, లిఫ్ట్‌ ఉపయోగించుకోవచ్చు. పూందమల్లి హైవే నుండి ప్లాట్‌ఫాం 11కి చేరుకోవడానికి నేరు గా ప్రత్యేక ర్యాంప్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

తిరుచ్చెందూర్‌ ఆలయంలో ఒకే రోజు 100 వివాహాలు

తిరువొత్తియూరు: తిరుచ్చెందూర్‌ సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆదివారం శుభ ముహూర్తం కావడంతో ఒకే రోజున సుమారు 100 వివాహాలు జరిగాయి. భక్తులు స్వామివారి దర్శనం కోసం దాదాపు 3 గంటల పాటు లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. మురుగన్‌ ఆరుపడై వీడులలో (ఆరు ముఖ్య క్షేత్రాలు) రెండవదైన ఈ ఆలయానికి ఆదివారం సెలవు రోజు కూడా కావడంతో తెల్లవారుజామున తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా వచ్చిన భక్తులు సముద్ర స్నానం , నాళీ తీర్థ స్నానాలు ఆచరించి, స్వామి దర్శనం కోసం పోటెత్తారు. కాగా ఈ వివాహ వేడుకలలో మంత్రి గీతా జీవన్‌ కూడా పాల్గొన్నారు.

బైకు – ప్రభుత్వ బస్సు ఢీ

– తాత, మనవడి మృతి

అన్నానగర్‌: నైల్లె జిల్లాలోని మానూర్‌ సమీపంలో ఉన్న నడుపుపిళ్ళైయార్‌ కుళం ప్రాంతానికి చెందిన మునియాండి (60). ఆదివారం తన మనవడు మునీష్‌ (17) తో కలిసి మోటార్‌ సైకిల్‌ పై ప్రయాణిస్తున్నాడు. మునీష్‌ మోటార్‌ సైకిల్‌ నడుపుతున్నాడు. నైల్లె–శంకరన్‌ కోయిల్‌ రహదారిపై ఉన్న పిళ్ళైయార్‌ కుళం ఎగ్జిట్‌ వద్దకు వస్తుండగా, వెనుక నుండి వస్తున్న వాహనాన్ని గమనించకుండా మునీష్‌ అకస్మాత్తుగా మోటార్‌ సైకిల్‌ను కుడివైపునకు తిప్పాడు. దీంతో కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని కుముళి నుంచి నైల్లె వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సు అనుకోకుండా మోటార్‌ సైకిల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మునియాండి, మనీష్‌ మరణించారు. మానూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, కన్యాకుమారి జిల్లా విలవన్‌కోటకు చెందిన బస్సు డ్రైవర్‌ సుభాష్‌ను విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement