డీఎంకే.. సభ్యుల గెంటివేత | - | Sakshi
Sakshi News home page

డీఎంకే.. సభ్యుల గెంటివేత

Sep 9 2026 12:23 AM | Updated on Sep 9 2026 12:23 AM

● అసెంబ్లీలో దుమారం ● సీఎం వ్యాఖ్యల తొగింపునకు పట్టు ● ఓ ఎమ్మెల్యేపై తీవ్రంగా విరుచుకుపడ్డ స్పీకర్‌ జె.సి.డి. ప్రభాకర్‌

సాక్షి, చైన్నె : తమిళనాడు శాసనసభ నుండి డీఎంకే సభ్యులను బయటకు గెంటివేశారు. సీఎం విజయ్‌ వ్యాఖ్యల తొలగింపునకు పట్టుబడుతూ సభలో డీఎంకే సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టారు. ఓ దశలో ఓమ్మెల్యేను ఉద్దేశించి స్పీకర్‌ జె.సి.డి. ప్రభాకర్‌ రావద్దు..గెట్‌ అవుట్‌ ..బయటకు వెళ్లూ అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా శాంతి భద్రతల పద్దు చర్చ సమయంలో సీఎం విజయ్‌ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని పట్టుబడుతూ మంగళవారం డీఎంకే సభ్యులు సభభలో నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా డీఎంకే విప్‌ ఎ.వి. వేలు మాట్లాడుతూ, సీఎం సీఎం విజయ్‌ సభా సంప్రదాయాలను ఉల్లంఘించి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ విచారణలో ఉన్న విషయాలను సభలో మాట్లాడకూడదని, ఈడీ నివేదికను సభలో చదవడం సభా నియమాలకు విరుద్ధం అని అసహనం వ్యక్తం చేశారు. మిసా చట్టం కింద అరెస్టయి ఎం.కె. స్టాలిన్‌ ఏడాది పాటూ జైలులో ఉన్నారని, సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదనే నియమం ఉన్నప్పటికీ, మురసోలి మారన్‌ గురించి సీఎం వ్యాఖ్యలు చేశారన్నారు. ఆధారం లేకుండా మాట్లాడిన వ్యాఖ్యలన్నింటినీ రికార్డుల నుండి తొలగించాలని అని డిమాండ్‌ చేశారు.

స్పీకర్‌ నిరాకరణ

స్పీకర్‌ జె.సి.డి. ప్రభాకర్‌ స్పందిస్తూ, మిసా చట్టంలో ఎం.కె. స్టాలిన్‌ అరెస్ట్‌ కావడం వాస్తవమేనని, అలాగే సర్కారియా కమిషన్‌ గురించి గతంలో కూడా సభలో చర్చ జరిగిందన్నారు. సీఎం మాట్లాడినప్పుడు డీఎంకే సభ్యులు ఏమాత్రం వినలేదని, తన అను మతి లేకుండా ప్లకార్డులు ఎందుకు ప్రదర్శించారు? , సీఎం మాట్లాడిన ఏ ఒక్క మాటను రికార్డుల నుండి తొలగించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో డీఎంకే సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ రసాభాస సృష్టించారు. పోడియం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. స్పీకర్‌ను చుట్టుముట్టారు. సభా నాయకుడు సెంగోట్టయ్యన్‌ జోక్యం చేసుకుంటూ, వరుసగా రెండు రోజులుగా రచ్చ చేస్తున్న డీఎంకే సభ్యులను బయటకు పంపాలని కోరారు. స్పీకర్‌ తొలుత డీఎంకే విప్‌కు మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పినప్పటికీ, డీఎంకే సభ్యులు నిరసన కొనసాగించారు. దీంతో మార్షల్స్‌ను పిలిపించి డీఎంకే సభ్యులందరినీ సభ నుండి బయటకు గెంటింవేశారు.డీఎంకే సభ్యులు తనను చుట్టుముట్టిన నేపథ్యంలో తనను సమీపించిన ఓ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రావద్దు..గెట్‌ అవుట్‌..బయటకు వెళ్లూ అంటూ తీవ్ర ఆగ్రహంతో హెచ్చరించడం గమనార్హం. అలాగే అనారోగ్యంతో మరో ఎమ్మెల్యేను మార్షల్స్‌ చుట్టుముట్టడంతో ఆయన్ని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లాలని స్పీకర్‌ సూచించారు. కాగా సభలో ఈ గందరగోళం జరిగిన సమయంలో సీఎం విజయ్‌, ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్‌ అసెంబ్లీలో లేకపోవడం గమనార్హం.

రీల్స్‌ కోసమే సీఎం విజయ్‌ ఆరాటం

అసెంబ్లీ వెలుపల మీడియాతో డీఎంకే విప్‌ ఏవి వేలు మాట్లాడుతూ, ‘‘ఎలాంటి ఆధారాలూ లేక మూతపడిన సర్కారియా కమిషన్‌ గురించి మాట్లాడి, రీల్స్‌ చేసుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడానికే సీఎం విజయ్‌ అసెంబ్లీలో వీరావేశంతో మాట్లాడరని మండి పడ్డారు. స్పీకర్‌ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా ప్రవర్తనలో దురుద్దేశం లేదు: విజయ్‌

శాసనసభలో తాను ప్రసంగించిన సమయంలో చేసిన హావభావాలు పూర్తిగా యాదృచ్ఛికమే. అందులో ఎలాంటి దురుద్దేశం లేదని సీఎం విజయ్‌ స్పష్టం చేశారు. దీనిని ఎవరూ తమను వ్యక్తిగతంగా బాధించే చర్యగా భావించవద్దని కోరుతున్నాను అని ఆయన వివరణ ఇచ్చారు. కాగా, గతంలో కూడా సీఎం విజయ్‌ ఓ మారు తగ్గేదే లేదు అన్నట్టుగా చేసిన హావాభావం వివాదానికి దారి తీసింది. ఇక ఆయన చివరి చిత్రం టైటిల్‌ కార్డులో ఆ ఫొ టో ప్రదర్శించడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఆధారాలు లేవు

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఎంకే స్టాలిన్‌ అప్పట్లో అరెస్టయ్యారనే రికార్డులు ఉన్నాయని, ఆయన మిసా చట్టం కింద అరెస్టయినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని అసెంబ్లీలో న్యాయశాఖ మంత్రి నిర్మల్‌ కుమార్‌ పేర్కొన్నారు. గతంలో సర్కారియా కమిషన్‌ నివేదికలో ఉన్న అంశాలనే సీఎం అసెంబ్లీలో గుర్తు చేశారని, పురుగుమందుల కొనుగోలు వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి రూ. 25 వేలు, ఆ తర్వాత మరో రూ. 25 వేలు తీసుకున్నారనే వివరాలు సర్కారియా కమిషన్‌ నివేదికలో స్పష్టంగా ఉన్నాయన్నారు. కరుణానిధిపై వచ్చిన ఆరోపణలలో ఆరు ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని కమిషన్‌ పేర్కొందని, ఆధారంగానే సిబిఐ కేసు నమోదు చేసిందన్నారు. మిసా చట్టం అమల్లో ఉన్న కాలంలో దొంగతనాలు, దోపిడీలు, మహిళలపై అక్రమాలకు పాల్పడిన వారిని కూడా అరెస్ట్‌ చేసేవారని, ఈ దృష్ట్యా, ఆ సమయంలో అరెస్టయిన ప్రతి ఒక్కరూ మిసా కిందే అరెస్టయ్యారని చెప్పలేమన్నారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించిన 20 సూత్రాల కార్యక్రమాన్ని విమర్శిస్తూ, మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే స్టాలిన్‌ అరెస్టయ్యారని రికార్డులు చెబుతున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement