సాక్షి, చైన్నె: చైన్నె మెట్రో రైల్ ఫేజ్–1 మార్గంలో రవాణా సామర్థ్యాన్ని, సేవా నిర్వహణను మరింత పెంచడం కోసం ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వ, వివరణాత్మక డిజైన్ సలహాలను అందించేందుకు రూ.35.97 కోట్ల తో కొత్త ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ కాంట్రాక్ట్‌ను ఏకామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నిప్పాన్ కోయి ఇండియా సంస్థల ఉమ్మడి భాగస్వామ్యం దక్కించుకున్నాయి.
ఒప్పందంపై సంతకాలు
చైన్నెలో జరిగిన కార్యక్రమంలో మెట్రో రైల్ డైరెక్టర్ మనోజ్ గోయల్, ఏకామ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి కాసా, నిప్పాన్ కోయి ఇండియా జాయింట్ డైరెక్టర్ సతీష్‌లాల్ సునేజాలు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్ కె. మణి వెంకట కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రాజెక్ట్ ప్రయోజనాలు
రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచడం, స్టేషన్లు , సాంకేతిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. అలాగే, మెట్రో ప్రయాణికుల సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, అత్యంత సురక్షితమైన రీతిలో ఈ అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేస్తారు. భవన నిర్మాణాలు , ట్రాక్‌లు, విద్యుత్ , మెకానికల్ పనులకు సంబంధించి వివరణాత్మక బ్లూప్రింట్‌లను తయారు చేయడం, టెండర్ ప్రక్రియను నిర్వహించడం , నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించే బాధ్యతలను ఈ సలహా సంస్థలు చేపడతాయి. కాగా ఇప్పటికే చైన్నెలో ఫేజ్– 1 ద్వారా విమానాశ్రయం ఆలందూరు మీదుగా సెంట్రల్ వైపుగా, అలాగే అన్నాసాలై మీదుగా సెంట్రల్ – విమ్కో నగర్‌వైపుగా రైలు సేవలు విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే.


