● సభ్యుల తీరుపై స్పీకర్ ఆవేదన
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ముగిశాయి. చివరిరోజు రవాణా, ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ తదితర శాఖల గ్రాంట్ డిమాండ్లపై చర్చ సభలో 11 బిల్లులు ఆమోదం పొందాయి. మంత్రి ఆనంద్ ప్రసంగిస్తూ మేట్టూరు సరరభంగ నీటిపారుదల ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి గురించి వివరించారు. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 565 కోట్ల నుండి సవరించి రూ. 707.76 కోట్లకు ఆమోదం పొందిందని ప్రకటించారు.
వేలుపై హక్కుల ఉల్లంఘన ఆరోపణ
మంత్రి ఆదవ్ అర్జున సభలో ప్రసంగిస్తూ డీఎంకే విప్, మాజీ మంత్రి ఇ.వి. వేలుపై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఏవి వేలు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు, సభ ఆమోదం లేకుండానే 2026–27 సంవత్సరానికి సంబంధించి రూ. 2,000 కోట్ల విలువైన 80 పనులకు వర్క్ ఆర్డర్లు మంజూరు చేశారని, ఇది అసెంబ్లీ ఆర్థిక ఆధిపత్యాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపించారు. ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తెలిపారు.
ప్రైవేట్ విశ్వవిద్యాలయాల
చట్ట సవరణ బిల్లు
ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్ మాట్లాడుతూ తమిళనాడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం, 2019 సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. కొత్త నిబంధనల మేరకు ప్రైవేట్ వర్సిటీ ఏర్పాటుకు గ్రేటర్ చైన్నెలో కనీసం 12 ఎకరాలు, ఇతర నగరాలు, మున్సిపాలిటీలలో 18 ఎకరాల భూమి సరిపోతుందని ప్రకటించారు. అలాగే, పర్మనెంట్ ఎండోమెంట్ ఫండ్‌ను రూ. 50 కోట్ల నుండి రూ. 25 కోట్లకు తగ్గించారు.
స్పీకర్ ఆవేదన
చివరి రోజు సభలో స్పీకర్ జె.సి.టి. ప్రభాకర్ తీవ్ర ఆవేదనతో వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తనకు హఠాత్తుగా అనారోగ్య సమస్య ఎదురైందని, అయినా సీఎం విజయ్ ప్రసంగానికి హాజరు కావాలనే ఉద్దేశంతో సభకు వచ్చినట్లు స్పీకర్ తెలిపారు. సోమవారం సీఎం విజయ్ ప్రసంగం సమయంలో డీఎంకే సభ్యులు చేసిన గందరగోళం చూసి తనకులో బీపీ.. కాస్త హై బీపీగా మారిపోయిందని సరదాగా వ్యాఖ్యానించారు. డీఎంకే సభ్యులకు మాట్లాడేందుకు అనేక అవకాశాలు ఇచ్చినా సభను అడ్డుకున్నారని తెలిపారు. సభలో డీఎంకే హంగామా సృష్టించినా ప్రశాంతంగా వ్యవహరిస్తూ సహకరించినందుకు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి, అధికార పక్ష సభ్యులకు స్పీకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
బీసీ, ఎంబీసీ కులాల వివరాలపై ప్రత్యేక తీర్మానం
2027లో జరగనున్న జనాభా గణన రెండవ దశలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ, ఎంబీసీ వంటి అన్ని వెనుకబడిన తరగతుల కుల వివరాలను కూడా నమోదు చేయాలని కోరుతూ తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానం ఆమోదించారు. అస్పష్టతకు తావిచ్చే ఓపెన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ తీర్మానానికి డీఎంకే సభ్యుల గెంటివేత నేపథ్యంలో అన్నాడీఎంకే మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇక, సభలో కళ్లకురిచ్చికల్తీ సారా మరణాలకు సంబంధించిన సమగ్ర విచారణకు నియమించిన జస్టిస్ గోకుల్‌దాస్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో సమర్పించారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్, రెవెన్యూ శాఖల తీవ్ర నిర్లక్ష్యం, విధి నిర్వహణ వైఫల్యమే ఈ ఘటనకు కారణమని నివేదికలో స్పష్టంచేశారు. బాధ్యులైన ఉన్నతాధికారులపై శాఖాపరమైన విచారణ జరపాలని మరియు కల్లకురిచి ప్రాంత యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలను నెలకొల్పాలని సూచించారు. కాగా, గత డీఎంకే పాలనలో విద్యుత్ బోర్డుకు రూ. 342 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా ఆడిట్ నివేదికను సభలో ప్రవేశ పెట్టారు. ఇక గ్రామీణ, మారుమూల ప్రాంతాల యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం పట్టణ స్థానిక ప్రభుత్వ సంస్థల్లోని పోస్టుల నియామక ప్రక్రియను తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి విస్తరిస్తూ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.


