ఉత్తరాది కార్మికుల నివాసంలో భారీ విస్పోటనం | - | Sakshi
Sakshi News home page

ఉత్తరాది కార్మికుల నివాసంలో భారీ విస్పోటనం

Aug 30 2026 1:51 AM | Updated on Aug 30 2026 1:51 AM

● పేలిన 22 సిలిండర్లు ● 30 సిలిండర్లు సురక్షితం

సాక్షి, చైన్నె: కోయంబత్తూరులో నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఉత్తరాది కార్మికులు నివాసం ఉన్న ప్రదేశంలో శనివారం మధ్యాహ్నం భారీ విస్పోటనం జరిగింది. 22 సిలిండర్లు వరుసగా పేలడంతో కలకలం రేగింది. బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి ఉత్తర రాష్ట్రాల నుం డి వచ్చిన 400 మందికి పైగా కార్మికులు కోయంబత్తూరులోని నవ్‌–ఇండియా ప్రాంతంలో ఉంటూ నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు. వారికి వసతి కల్పించడానికి ఇక్కడ 75 రేకుల షెడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి షెడ్డులో కనీసం 5 మంది ఉంటూ పనికి వెళ్లి రావడం జరుగుతున్నది. అలాగే, ఈ కార్మికులు వండుకుని తినడానికి ప్రతి షెడ్డుకు ఒక గ్యాస్‌ సిలిండర్‌ ఉన్నట్లు సమాచారం. వీటిలో ఒక వంట గ్యాస్‌ సిలిండర్‌, ఒక వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌, ఒక 5 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ చొప్పున ఉన్నాయి. ఈ పరిస్థితిలో, కార్మికులు ఉదయం యధావిధిగా పనికి వెళ్లారు. షెడ్డులో కొద్దిమంది కార్మికులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం పూట కొందరు వంట చేస్తున్న సమయంలో హఠాత్తుగా ప్రమాదం జరిగింది. అక్కడున్న వారు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. అయితే, మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న కోయంబత్తూరు సౌత్‌ ఫైర్‌ స్టేషన్‌నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు. మంటలు క్రమంగా వ్యాపించడంతో అక్కడున్న గ్యాస్‌ సిలిండర్లు వేడిని తట్టుకోలేక ఒక్కొక్కటిగా పేలడం ప్రారంభించాయి. దీంతో పీళమేడు , కోయంబత్తూరు నార్త్‌ అగ్నిమాపక కేంద్రాల నుండి అదనపు అగ్నిమాపక వాహనాలను రప్పించారు. సుమారు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదంలో షెడ్లలోని 22 సిలిండర్లు పేలిపోయాయి.

మరో 30 సిలిండర్లు సురక్షితంగా నిర్వీర్యంచేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పీలమేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, షెడ్డులన్నీ ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉత్తరాది కార్మికులకు చెందిన వస్తువులన్ని అగ్నికి ఆహుతి అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement