దయానిధికి మరోసారి వైద్య పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

దయానిధికి మరోసారి వైద్య పరీక్షలు

Aug 30 2026 1:51 AM | Updated on Aug 30 2026 1:51 AM

– మదురై సీబీఐ కోర్టు ఆదేశం

సాక్షి, చైన్నె: మాజీ కేంద్ర మంత్రి ఎంకే అళగిరి కుమారుడు దయానిధికి పుదుచ్చేరిలోని జిప్మర్‌ ఆసుపత్రిలో మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలని మదురై సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం ఆదేశించింది. మదురై కీళవలవు పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా, రూ. 256 కోట్ల మనీ లాండరింగ్‌ చట్టం కింద దయానిధిపై ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. అయితే, దయానిధి నరాల బలహీనత , పక్షవాతంతో బాధపడుతున్నారని, విచారణ ఎదుర్కొనే పరిస్థితిలో లేరని ఆయన తరఫు న్యాయవాదులు ఇది వరకే కోర్టుకు తెలిపారు. చైన్నె రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సమర్పించిన వైద్య నివేదిక ఆధారంగా ఆయనపై ఉన్న కేసును ప్రత్యేకంగా వేరుచేసి విచారణను వాయిదా వేశారు.

ఈడీ వాదన..

తాజాగా ఈ కేసు మదురై సిబిఐ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఈడీ న్యాయవాది బలమైన వాదనలు వినిపించారు. దయానిధి చైన్నెలోని చేపాక్‌ మైదానంలో జరిగిన ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను నేరుగా తిలకించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినట్టు వివరించారు. అలాగే,ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటు వేసిన ఫొటోను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఆయన ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టమవుతోందని, ఈ దృష్ట్యా, పుదుచ్చేరి జిప్మర్‌ లేదా ఎయిమ్స్‌ వైద్య బృందంతో మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఈడీ తరపు న్యాయవాది కోరారు.దీనిపై దయానిధి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కోర్టు ఆదేశాల మేరకే గతంలో ఆయన అనారోగ్యం ధ్రువీకరించబడిందని, కేవలం సోషల్‌ మీడియా ఫొటోలను ఆధారంగా చేసుకుని మళ్లీ వైద్య పరీక్షలకు ఆదేశించకూడదని వాదించారు.

కోర్టు వ్యాఖ్యలు

ఇరువైపులా వాదనలు విన్న మదురై అదనపు జిల్లా , సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్‌. షణ్ముగవేల్‌ కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.‘క్రికెట్‌ మ్యాచ్‌ను నేరుగా వెళ్లి చూడటం, ఎన్నికల్లో ఓటు వేయడం సాధ్యమైనప్పుడు.. కోర్టుకు హాజరై విచారణను ఎదుర్కోవడంలో ఉన్న అడ్డంకి ఏంటి? అని ప్రశ్నించారు. దయానిధి ప్రస్తుత మానసిక స్థితి, విషయ గ్రహణ సామర్థ్యం , శారీరక దృడత్వాన్ని పరీక్షించేందుకు జిప్మర్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ నేతృత్వంలో చీఫ్‌ సైకియాట్రిస్ట్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌ , చీఫ్‌ న్యూరాలజిస్ట్‌లతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే దయానిధిని ఆసుపత్రిలో ఇన్‌–పేషెంట్‌గా చేర్చుకుని పరీక్షించే అధికారాన్ని జిప్మర్‌ డైరెక్టర్‌కు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. జిప్మర్‌ వైద్యబృందం నిర్వహించే వైద్య పరీక్షలకు దయానిధి పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. వైద్య పరీక్షల అనంతరం సమగ్ర నివేదికను సీల్డ్‌ కవర్‌ ద్వారా నేరుగా కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి తన ఉత్తర్వులలో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement