– ఇద్దరి అరెస్ట్
తిరువొత్తియూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి, టాటా నగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు మీంజూర్‌లోని రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీని ఆధారంగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ జేమిస్‌బాబు నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం రైల్వే స్టేషన్‌కు చేరుకుని నిఘా ఉంచారు.ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులను అడ్డుకున్న మద్యనిషేధ విభాగం పోలీసులు వారిని విచారించారు. విచారణలో వారు మధురై తిరుప్పరంకుండ్రం ఆవిపేట ప్రాంతానికి చెందిన ప్రేమ్‌నాథ్ (41), ఆదిశివన్ నగర్‌కు చెందిన శివచంద్రన్ ( 41) అని తెలిసింది. అనంతరం వారి వద్ద నుండి 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని మీంజూర్‌కు తీసుకువచ్చి విచారించారు. ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తరలించి మధురై ఉసిలంపట్టికి తీసుకువెళ్లి విక్రయించడానికి ప్లాన్ చేసినట్లు వారు తెలిపారు. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత వారిని జైలుకు తరలించారు.
5 ఎకరాల్లో చౌకు తోట దగ్ధం
తిరుత్తణి: చౌకు తోటలో మంటలు చెలరేగడంతో పొగ కమ్ముకుని జాతీయ రహదారిలో ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనకమ్మసత్రం సమీపంలోని చైన్నె తిరుపతి జాతీయ రహదారిలో మావూరు వద్ద సుబ్రహ్మణ్యం అనే రైతు తన ఐదు ఎకరాల పొలంలో సౌకు తోట సాగుచేస్తున్నారు. తోట దిగుబడికి వచ్చిన క్రమంలో శనివారం మధ్యా హ్నం రెండు గంటల సమయంలో తోటలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాదాపు మూడు గంటల ఆలస్యంగా తిరుత్తణి అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని గంటపాటు పోరాటి మంటలను కట్టడి చేశారు. అయితే అంతలోనే తోట పూర్తిగా కాలి నిరుపయోగంగా మారింది. కనకమ్మసత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కానన్ సరికొత్త ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : రక్షా బంధన్ వేడుకలలో భాగంగా సోదర సోదరీమణుల మధుర స్మృతులను గుర్తు చేస్తూ కానన్ సరికొత్త ఆవిష్కరణలను ప్రకటించించింది. చిన్ననాటి అల్లరి క్షణాల నుండి, కుటుంబ వేడుకలు, మనస్ఫూర్తిగా నవ్వుకునే అనుభూతుల వరకు ప్రతీ రక్షా బంధన్ భద్రపరుచుకోదగ్గ జ్ఞాపకాలను అందిస్తూ, ఫోటోగ్రఫీ భావోద్వేగాలను క్షణాల్లో బంధిస్తే, ప్రింటింగ్ సాంకేతికత వాటిని నిరంతరం గుర్తుండిపోయే భౌతిక జ్ఞాపకాలుగా మారుస్తుందని ప్రటకించింది. ఆ మేరకు కానన్ ఇమేజింగ్ , ప్రింటింగ్ సాధనాలతో, అద్భుతమైన ఫోటోల నుండి పర్సనలైజ్డ్ ప్రింట్ల వరకు కుటుంబాలు , క్రియేటర్లు ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొత్త ఆవిష్కరణలుగా కానన్ ఈఓఎస్ ఆర్6వీ , కానన్ పిక్స్‌మా జీ 3770లను స్థానికంగా నిర్వాహకులు పరిచయం చేసి ప్రసంగించారు.


