– కేసును సీబీఐకు అప్పగించాలని పిటిషన్
సాక్షి, చైన్నె : డీఎంకే నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తూ వారి ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారనే ఫిర్యాదులను సీబీఐ విచారణకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై రెండు వారాల్లోగా సమాధానం వివరణ ఇవ్వాలని పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. డీఎంకే న్యాయ విభాగం ఉప కార్యదర్శి చంద్రబోస్ చైన్నె హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియా వేదికగా డీఎంకేను, డీఎంకే అగ్రనేతలను టార్గెట్ చేస్తూ, వారి ప్రతిష్టకు భంగం క లిగించే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో రూపొందించిన ఫొటోలు, వీడియోలను కొన్ని ప్రైవేట్ ఇంటర్నెట్ సంస్థలు, వ్యక్తులు బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని వివరించారు. దీనిపై తమిళనాడు వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో వాయిస్ ఆఫ్ కామన్, ’రూట్’ తదితర సంస్థలపై 19 ఫిర్యాదులు చేసినప్పటికీ, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అదే సమయంలో, అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన వారికి వ్యతిరేకంగా సైద్ధాంతికంగా అభిప్రాయాలు చెప్పే వారిపై మాత్రం పోలీసులు వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. ఈ దృష్ట్యా, డీఎంకే తరఫున ఇచ్చిన ఫిర్యాదులన్నింటినీ సీబీఐ విచారణకు బదిలీ చేసి, న్యాయమైన, స్వతంత్ర విచారణ జరిగేలా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ జస్టిస్ వి. లక్ష్మీ నారాయణన్ బెంచ్ ఎదుట శనివారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎన్.ఆర్. ఇలంగో వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... ఈ అంశంపై తమిళనాడు డీజీపీ , చైన్నె నగర పోలీస్ కమిషనర్ తదితరులు రెండు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
శ్రీలంక నుంచి చైన్నెకి చేరుకున్న ఏడుగురు జాలర్లు
తిరువొత్తియూరు: శ్రీలంక జైలు నుండి విడుదలైన తమిళనాడు జాలర్లు ఏడుగురు చైన్నె చేరుకున్నారు ప్రభుత్వ ఏర్పాట్లతో సొంత ఊళ్లకు పంపించే ప్రక్రియ జరుగుతోంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరం ప్రాంతానికి చెందిన నలుగురు జాలర్లను 2024 జూలైలో శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురిని విడుదల చేయగా ఒకరిని విడుదల చేయలేదు. అలాగే కన్యాకుమారి జిల్లాకు చెందిన ఆరుగురు మత్స్యకారులను ఇటీవల కాలంలో అరెస్టు చేశారు. వారు శ్రీలంక జైలులో నిర్బంధించబడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు, శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయ అధికారులు శ్రీలంక ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత గత 22వ తేదీన ఆ 6 గురు మత్స్యకారులను కూడా విడుదల చేసి, భారత రాయబార కార్యాలయ అధికారులకు అప్పగించారు. అనంతరం అధికారులు విమానం ద్వారా మొత్తం ఏడుగురు మత్స్యకారులను శుక్రవారం రాత్రి విమానంలో చైన్నెకి పంపించారు. చైన్నె విమానాశ్రయంలో ఆ ఏడుగురు మత్స్యకారులకు తమిళనాడు మత్స్యశాఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాట్లతో వాహనాల ద్వారా వారిని సొంత ఊళ్లకు పంపించి వేశారు.
చైన్నెలో వరదల నియంత్రణ పనులకు..
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతుపవనాల వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు , నగరం వరద ముప్పుకు గురికాకుండా చూసేందుకు గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ ముందస్తు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రూ. 100 కోట్లతో వివిధ పనులకు గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జి.ఎస్. సమీరన్ ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాల సన్నాహకాలపై శనివారం రిపన్ బిల్డింగ్ లో కమిషనర్ జి.ఎస్. సమీరన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ ఎస్. శరవణన్, డిప్యూటీ కమిషనర్లు చిత్రవిజయన్, అథబ్రాసుల్, శ్వేతాసుమన్, ఇతర కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
రూ. 100 కోట్ల ప్రత్యేక నిధులు: వర్షాకాలం, ఎల్ నినో ప్రభావం వల్ల కలిగే వరద ముప్పును నివారించేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు రూ. 100 కోట్లు కేటాయించారు. నీటి పారుదలకు అడ్డంకులు లేకుండా చేసేందుకు రూ. 22.46 కోట్ల వ్యయంతో పూడికతీత పనులకు చర్యలు తీసుకున్నారు. వీటిలో రూ. 16 లక్షల వ్యయంతో డ్రోన్‌లను ఉపయోగించి ప్రధాన కాలువల పరిధిని సర్వే చేయడానికి నిర్ణయించారు. అత్యవసర, స్థానిక వర్షాకాల పనుల కోసం ప్రతి వార్డుకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 10 కోట్లు కేటాయించారు. దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, ప్యాచ్ వర్క్‌లు, గుంతల పూడ్చివేత పనులకు రూ. 22 కోట్లు కేటాయించి కాంట్రాక్ట్ టెండర్లను ఆహ్వానించారు. కాలువలను సరిచేయడం, ఆకాశ తామర మొక్కలను తొలగించడం, ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను నరికివేయడం, భారీ మోటార్ పంపులు, వాహనాలను సిద్ధంగా ఉంచడం వంటి పనులను వేగవంతం చేయనున్నారు.


