జల్లికట్టు వివాదం..! | - | Sakshi
Sakshi News home page

జల్లికట్టు వివాదం..!

Aug 30 2026 1:27 AM | Updated on Aug 30 2026 1:27 AM

● టీవీకే ఎమ్మెల్యేపై సర్వత్రా ఆగ్రహం ● సమర్థించిన మంత్రి నిర్మల్‌కుమార్‌

సాక్షి,చైన్నె: జల్లికట్టు క్రీడను ఉద్దేశించి చోళవందన్‌ టీవీకే ఎమ్మెల్యే కరుప్పయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయం దుమారం రేపింది. ఆయన వ్యాఖ్యలను ప్రతి పక్షాలు తీవ్రంగా దుయ్యబట్టే పనిలో పడ్డాయి. నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ స్పందిస్తూ, తమిళుల వేల సంవత్సరాల సాంస్కృతిక ప్రతీక, వీరత్వానికి నిదర్శనమైన జల్లికట్టుకు అపఖ్యాతి తీసుకొచ్చేవిధంగా ఎమ్మెల్యే కరుప్పయ్య మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమ్మే మద్యం వలన యువత చెడిపోవడం లేదా? ఆ పద్ధతిని మాన్పించే ధైర్యం లేనివారు, మట్టితో, పశువులతో ముడిపడిన వీరక్రీడను విమర్శిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ స్పందిస్తూ, ప్రపంచ ప్రసిద్ధి చెందిన అలంగానల్లూర్‌ పరిధిలోని చోళవందాన్‌ ఎమ్మెల్యేతో ఇలా మాట్లాడించడం వెనుక భవిష్యత్తులో జల్లికట్టును నిషేధించేందుకు టీవీకే ప్రభుత్వం కుట్ర పన్నుతోందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఈ అవమానకర వ్యాఖ్యలను వెంటనే అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి తరపున ఆ పార్టీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ‘తమిళ సాంప్రదాయాన్ని, పశు సంపదను కాపాడే జల్లికట్టుపై అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు.ఈ అంశంపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

సమర్థించుకున్న మంత్రి నిర్మల్‌కుమార్‌

మదురై మీనాక్షి అమ్మన్‌ ఆలయ కుంభాభిషేకం ఏర్పాట్ల సమీక్ష అనంతరం మంత్రి నిర్మల్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదంపై స్పందించారు. డీఎంకే హయాంలో కేవలం కలైంజ్ఞర్‌ పేరు పెట్టడం కోసమే జల్లికట్టు స్టేడియం నిర్మించారని,. జల్లికట్టు అనేది కేవలం ఒక వినోదం కాదని, అది తమిళుల భావోద్వేగాలతో ముడిపడిన సంస్కృతిగా పేర్కొన్నారు. అలాంటి వీర క్రీడను ఒక స్టేడియం పరిధికి పరిమితం చేసి, జల్లికట్టు పేరుతో డీఎంకే ప్రభుత్వం యువతను తప్పుదోవ పట్టించిందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడారని వివరించారు. అయితే ఆయన పూర్తి వివరాలు చెప్పేలోపే మైక్‌ ఆఫ్‌ అయ్యిందంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలను సమర్థించారు. మరోవైపు, ఎమ్మెల్యే కరుప్పయ్య కూడా స్పందిస్తూ, యువతను సరైన మార్గంలో నడిపించాలనే మంచి ఉద్దేశంతోనే మాట్లాడానని, జల్లికట్టును అవమానించే దురుద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement