సాక్షి, చైన్నె: పుదుచ్చేరి పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా మధురాంతకం సమీపంలో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కళాశాల విద్యార్థులు దుర్మరణం చెందిన తీవ్రంగా గాయపడిన మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్సలో ఉన్నారు. పల్లవరంలోని వేల్స్ కళాశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థుల బృందం ఒక స్నేహితుడి కారులో పుదుచ్చేరి పర్యటనకు వెళ్లారు. పర్యటన ముగించుకుని తిరుచ్చి–చైన్నె జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి వేళ తిరిగి వస్తుండగా, మధురాంతకం సమీపంలోని ఒక మలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న సెంటర్ మీడియన్‌ను ఢీకొట్టింది.అదే సమయంలో కారు వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం ఫల్టీలు కొడుతూ బొల్తా పడింది. కారులో ఉన్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ముగ్గురి మృతి..
స్థానిక వాహనదారుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మధురాంతకం పోలీసులు గాయ పడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యంకోసం చెంగల్పట్టు ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో కడలూరు జిల్లా వడలూరుకు చెందిన దీపక్‌రాజ్(19), కన్యాకుమారికి చెందిన పీటర్ స్టానిగో(21), కరూర్‌కు చెందిన రాజ్ ప్రసాద్ (20)గా గుర్తించారు. వీరంతా ఆ కళాశాలలో బీఎం, ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ చదువుతున్నారు. గాయపడ్డ వారిలో కరూర్‌కు చెందిన రామ్ ప్రసాద్(19), మదురై ఆలందూరుకు చెందిన హరికృష్ణన్(19), కడలూరు కు చెందిన అనీశ్వరన్(19), లోకేశ్వరన్(19) ఉన్నారు. మరణించిన రాజ్ ప్రసాద్, గాయపడ్డ రామ్ ప్రసాద్‌లు ఇద్దరు కవల సోదరులు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై సుమారు గంటసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించిన మధురాంతకం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


