సాక్షి, చైన్నె: చైన్నె నగరం మరింతగా.. కొత్త రూపు సంతరించుకోనుంది. వేగవంతమైన పట్టణీకరణ, మారుతున్న ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న మౌలిక సదుపాయాల అవసరాలు, పర్యావరణం, వాతావరణ మార్పుల సవాళ్లను దృష్టిలో ఉంచుకుని చైన్నె మెట్రోపాలిటన్ ప్రాంతానికి దీర్ఘకాలిక ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ ఎంతో అవసర అన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 1976లో చైన్నె నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం, మూడు రింగ్ రోడ్ల నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి తొలి మాస్టర్ ప్లాన్ అమల్లోకి తెచ్చారు. ఆతదుపరి రెండవ మాస్టర్ ప్లాన్ 2006–2026 కాలంలో అమల్లోకి తెచ్చారు. సాంద్రత కలిగిన పట్టణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, వరద నివారణ చర్యలు, జలాశయాల రక్షణ, సమాచార సాంకేతికత రంగానికి ఇందులో పెద్ద పీట వేశారు. ఈ రెండు ప్లాన్ల అనుభవాల ఆధారంగా 3వ మాస్టర్ ప్లాన్ 2027–2047 సంవత్సరానికి గాను తయారు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం 2021లో చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ)కి అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా సీఎండీఏ అధికారులు, వివిధ రంగాలు, నిపుణుల వారీగా అధ్యయనాలు పూర్తి చేసింది. శాటిలైట్ చిత్రాలు (ఉపగ్రహ ఛాయాచిత్రాలు), డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(డీజీపీఎస్) సర్వేల సహాయంతో జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐ) ఆధారిత డిజిటల్ మ్యాప్‌ను సిద్ధం చేశారు.
అందర్నీ మమేకం చేస్తూ 3వ ప్లాన్
చైన్నె 3వ మాస్టర్ ప్లాన్ అనేది అందరినీ కలుపుకొనిపోయే సుస్థిర పట్టణాభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచే రీతిలో రూపకల్పనకు చేస్తున్రాను. ఇది మౌలిక సదుపాయాల ప్రణాళికను బలోపేతం చేయడం, సమతుల్య ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, పర్యావరణ వనరులను కాపాడటం , ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చట్టబద్ధమైన చట్రంగా పనిచేయనున్నది. ఈ రకంగా చైన్నెని ప్రపంచ స్థాయి భవిష్యత్తు అవసరాలకు తగ్గ మెట్రోపాలిటన్ నగరంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పవచ్చు. ఈ ప్లాన్‌లో 2047 నాటికి ఈ ప్రాంతమంతా సమగ్ర, సమతుల్య అభివృద్ధిని సాధించేలా విస్తరించిన ప్రాంతాలతో అనుసంధానించబడుతుంది. 1,189 చదరపు కిలోమీటర్ల మేరకు 3వ మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించి ఖరారు చేయడంతో పాటు, విస్తరించిన చైన్నె మెట్రోపాలిటన్ ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించడానికి అంతర్జాతీయ అనుభవం ఉన్న ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌ను సీఎండీఏ నియమించనుంది. శాసనసభలో సమర్పించిన గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విధాన నిర్ణయ నివేదికలో ఈ వివరాలును ప్రకటించారు.
రాజధాని నగరం చైన్నెను మెగా సిటీగా రూపకల్పన చేయడం లక్ష్యంగా 3వ మాస్టర్ ప్లాన్ రూపకల్పన కసరత్తు వేగవంతం చేశారు. తమిళనాడు పట్టణాభివృద్ధి శాఖ ఇందు కోసం విధాన నిర్ణయ నివేదికలో ప్రకటించింది. చైన్నె నగరాన్ని ప్రపంచ స్థాయి మెగా సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతున్నట్టు వివరించారు.


